Site icon HashtagU Telugu

Record Liquor Sales: రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు!

Liquor Shop

Liquor Shop

Record Liquor Sales: ద‌స‌రా సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 2025 నెలలో దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. నిషేధం, ఎక్సైజ్ శాఖ (Prohibition and Excise Department) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మద్యం అమ్మకాలు ఏడు శాతం (7% )పైగా వృద్ధి చెందాయి. గత కొద్దికాలంగా అమ్మకాల మందకొడితనం కారణంగా ఆందోళనలో ఉన్న ఎక్సైజ్ శాఖకు ఈ భారీ విక్రయాలు కొంత మేరకు ఊరటనిచ్చాయి.

సెప్టెంబర్ నెల గణాంకాలు

సెప్టెంబర్ 2025 నెలలో రాష్ట్రంలో మొత్తం రూ. 3048 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం అంటే సెప్టెంబర్ 2024లో ఈ మొత్తం రూ. 2838 కోట్లుగా నమోదైంది. కేవలం నెలవారీ అమ్మకాల పోలికలోనే ఏడు శాతానికి పైగా పెరుగుదల కనిపించింది.

ఐఎంఎల్ (IML) లిక్కర్ అమ్మకాలు

సెప్టెంబర్ 2025లో 29.92 లక్షల లిక్క‌ర్ అమ్మ‌కాలు జ‌ర‌గ‌గా.. సెప్టెంబర్ 2024లో 28.81 లక్షల లిక్క‌ర్ అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ అమ్మకాల పరంగా చూస్తే.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

Also Read: AP Inter Schedule: ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు!

తగ్గిన బీర్ల అమ్మకాలు

మరోవైపు లిక్కర్ అమ్మకాలు పెరిగినప్పటికీ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. 2024 సెప్టెంబర్ నెలలో 39.71 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా.. 2025 సెప్టెంబర్ నెలలో కేవలం 36.46 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అయినప్పటికీ లిక్కర్ అమ్మకాల్లో వచ్చిన భారీ వృద్ధి కారణంగా ఎక్సైజ్ శాఖ ఆదాయం లక్ష్యాన్ని చేరుకోగలిగింది.

దసరా ముందస్తు విక్రయాల జోరు

ముఖ్యంగా దసరా పండుగకు ముందు మూడు రోజుల్లో మద్యం విక్రయాలు అత్యధికంగా జరిగాయి. ఈ మూడు రోజుల విక్రయాలు గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 60 శాతం నుంచి 80 శాతం వరకు పెరిగాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది.

మూడు రోజుల విక్రయాలు (రూ. కోట్లలో)

సెప్టెంబర్ 29న రూ. 278 కోట్ల మ‌ద్యం అమ్ముడు కాగా.. సెప్టెంబర్ 30న రూ. 333 కోట్లు, అక్టోబ‌ర్ 1న రూ. 86.23 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. పండుగల సమయంలో మద్యం అమ్మకాలు పెరగడం సాధారణమే అయినప్పటికీ ఈసారి నమోదైన భారీ వృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ఎక్సైజ్ శాఖ ఆదాయ అంచనాలకు మరింత బలాన్ని చేకూర్చింది.

Exit mobile version