కాంగ్రెస్ శ్రేణులకు గుడ్ న్యూస్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) తిరిగి ఎంపీగా కొనసాగనున్నారు. ఆయన పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. ప్రధాని మోడీ ఇంటి పేరు కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మార్చి 23, 2023 న గుజరాత్ కోర్ట్ తీర్పునిచ్చింది. ఆ మరుసటి రోజు మార్చి 24, 2023 న రాహుల్ పై అనర్హతవేటు పడింది. ప్రజాప్రాతినిధ్య చట్టం – 1951 లోని నిబంధనల ప్రకారం పార్లమెంట్ సెక్రటేరియేట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా రెండేళ్ల జైలు శిక్షను రాహుల్ గాంధీ సవాలు చేయడంతో ఆగస్టు 4, 2023న సుప్రీం కోర్ట్ స్టే విధించింది. సుప్రీం కోర్ట్ (Supreme Court) ఆదేశాల నేపథ్యంలో రాహుల్ పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్టు లోక్ సభ సెక్రటేరియేట్ స్పష్టం చేసింది. సుప్రీం కోర్ట్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేసింది.
ఇక రాహుల్ (Rahul Gandhi) లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద వేడుకలు మొదలయ్యాయి. కాంగ్రెస్ మద్దతుదారులు డప్పుల మోతతో డ్యాన్స్ చేస్తూ తమ నాయకుడికి అనుకూలంగా తీర్పు రావడంతో సంబరాలు చేసుకున్నారు. ఆగస్టు 8 నుంచి లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న తరుణంలో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని (Rahul MP) పునరుద్ధరిస్తున్నారు. ఆగస్టు 8 నుంచి 10 వరకు పార్లమెంట్ లో ఈ చర్చ జరగనుంది. దీనిపై ప్రధాని ఆగస్టు 10న ప్రకటన చేయనున్నారు. మరి ఈ చర్చలో కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాల్గొంటారా లేదా అనేది చూడాలి.
వాస్తవానికి సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన రోజునే కాంగ్రెస్ శ్రేణులు ఆకాశాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు. తీర్పు అయితే రాహుల్ గాంధీకి (Rahul Gandhi) అనుకూలంగా వచ్చింది కానీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఆయన హాజరవుతారా లేదా అనేదానిపై టెన్షన్ లో ఉన్నారు. ఈరోజు (ఆగస్టు 07, 2023) సోమవారం, లోక్ సభ కార్యాలయం నుండి స్పీకర్ నోటిఫికేషన్ విడుదల చేయడం.. ఈ నోటిఫికేషన్లో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు తెలుపడం తో సంతోషం వక్తం చేస్తున్నారు.
Read Also : National Handlooms Day: చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్