Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు మాజీ ఎస్‌ఐబీ చీఫ్ (ఓఎస్డీ) టి. ప్రభాకర్ రావు బుధవారం సిట్ విచారణకు రెండో రోజుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్యాప్తు అధికారులు ఆయన వ్యక్తిగత సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక, సిట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన వాడిన అధికారిక, అనధికారిక సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్లు తదితర పరికరాలను అప్పగించాల్సి ఉంది.
సోమవారం జరిగిన తొలి రోజు విచారణలో హార్డ్ డిస్క్‌ల ధ్వంసం అంశంపై సిట్ అధికారులు ప్రశ్నలు గుప్పించారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే మాజీ డీఎస్సీ ప్రణీత్ రావు ఎస్‌ఐబీకి సంబంధించిన కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్క్‌లు, డేటాను నాశనం చేసినట్లు వెల్లడైంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది.
ISRO : శుభాంశు శుక్లా రోదసియాత్ర వాయిదాపై స్పందించిన ఇస్రో ఛైర్మన్
విచారణలో ప్రభాకర్ రావు సహకరించకపోవడం, ఎదురు ప్రశ్నలు వేసిన తీరు విచారణను మరింత కీలకంగా మార్చింది. దీంతో ఈ రోజు జరిగిన విచారణలో ఇప్పటికే అరెస్టయిన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు వాంగ్మూలాలతో పాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నుంచి రికవర్ చేసిన డేటా ఆధారంగా ప్రశ్నలు కొనసాగించారు.
సిట్ అధికారుల ప్రాధాన్యత అంశాలు..
- న్యాయమూర్తులు, కీలక వ్యక్తుల ప్రొఫైలింగ్ ఎందుకు జరిగింది?
- స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఎందుకు ఏర్పాటైంది?
- హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది?
ఈ అంశాలపై ఆధారాలతో కూడిన ప్రశ్నలకు సన్నద్ధమైన సిట్ అధికారులు, ప్రభాకర్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. మంగళవారం ప్రభాకర్ రావు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయన అమెరికాలో ఉన్న సమయంలో ప్రకటనిత నేరస్తుడిగా ప్రకటించాలంటూ సిట్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు న్యాయమూర్తి జూన్ 20లోపు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే సంబంధిత న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ప్రభాకర్ రావు తిరిగి వెళ్లిపోయారు. ఈ కేసు తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో, సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.
Mangli Birthday Party: మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి కలకలం.. సినీ ప్రముఖులు అరెస్ట్?