Polepongu Srilatha : మారుమూల పల్లెటూరు సుబ్లేడు గ్రామానికి చెందిన పోలేపొంగు శ్రీలత తన పట్టుదల, కృషితో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పేదరికం అడ్డుగా నిలిచినా, అనేక కష్టాలను తట్టుకుని, తాను ఎన్నుకున్న మార్గంలో టాప్ ర్యాంక్ సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన పోలేపొంగు శ్రీలత, ఐసీఏఆర్ – ఏఆర్ఎస్ 2023 నోటిఫికేషన్ ప్రకారం ప్లాంట్ పాథాలజీ విభాగంలో ఆల్ ఇండియా ఐదో ర్యాంక్ సాధించింది. ఓపెన్ కేటగిరీలో సైంటిస్ట్‌గా ఎంపికైన శ్రీలత, ఇప్పుడు జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR)లో శాస్త్రవేత్తగా నియమితురాలవుతోంది.
విద్యాభ్యాసం – పల్లెటూరి నుంచి జాతీయ స్థాయికి
పోలెపొంగు జగ్గయ్య, కృష్ణకుమారి దంపతుల కుమార్తె శ్రీలత, పాఠశాల విద్యను సుబ్లేడులోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి వరకు, తర్వాత వైరా ఎస్సీ బాలికల హాస్టల్‌లో పదవ తరగతి వరకు పూర్తి చేసింది. ఇంటర్ చదువునకు విజయవాడ శ్రీచైతన్య జూనియర్ కాలేజీని ఎంపిక చేసుకున్న ఆమె, బీఎస్సీ కోసం అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీని అడుగుపెట్టింది.
మహారాష్ట్రలో ఎమ్మెస్సీ (ప్లాంట్ పాథాలజీ) పూర్తి చేసిన తర్వాత, హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందింది. అనంతరం, ఆమె తన పాత కళాశాల అయిన అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తూ, తన విద్యార్థులకు పాఠాలు బోధించడం ప్రారంభించింది.
పరీక్షా విజయంతో శాస్త్రవేత్తగా నియామకం
ఉద్యోగంలో ఉండేంత మాత్రాన తన లక్ష్యాలను పక్కనపెట్టలేదు శ్రీలత. అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ASRB) నిర్వహించిన పోటీ పరీక్షకు సిద్ధమై తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించింది. తద్వారా, మొక్కల వ్యాధుల నివారణ కోసం పరిశోధనలు చేయడమే ప్రధాన లక్ష్యంగా శాస్త్రవేత్తగా ఎంపికైంది.
తక్కువ ఖర్చుతో రసాయనాలు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన పంటలు పండించడం ద్వారా రైతులకు మేలు చేకూర్చడం తన ప్రధాన లక్ష్యమని శ్రీలత స్పష్టం చేసింది. అతి త్వరలో ఐకార్‌లో శాస్త్రవేత్తగా ఆమె తన పోస్టింగ్‌ను అందుకోనుంది. తన విజయంతో గ్రామానికి గర్వకారణమైన శ్రీలతను, గ్రామస్థులు , కుటుంబ సభ్యులు అభినందించారు. పేదరికం అడ్డుగా నిలవలేదని, లక్ష్యం పై నమ్మకంతో కష్టపడితే విజయం సాధ్యమని శ్రీలత తన జీవితంతో నిరూపించింది.
Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసు.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరు