PM Modi Speech : మణిపూర్‌ మహిళలకు జరిగిన అవమానం మనందరికీ తలవంపే : మోడీ

PM Modi Speech : మణిపూర్‌లో మహిళలకు జరిగిన ఘోర అవమానం మనందరికి తలవంపే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆ రాష్ట్ర ప్రజలకు అండగా భారతదేశం మొత్తం ఉందన్నారు.

  • Written By:
  • Updated On - August 10, 2023 / 07:40 PM IST

PM Modi Speech : మణిపూర్‌లో మహిళలకు జరిగిన ఘోర అవమానం మనందరికి తలవంపే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆ రాష్ట్ర ప్రజలకు అండగా భారతదేశం మొత్తం ఉందన్నారు. మణిపూర్ లో మళ్లీ శాంతి వెల్లివిరుస్తుందని, పురోగతి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు ఐక్యంగా మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని భావిస్తున్నానని చెప్పారు. విపక్షాల కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం ఉదయం లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. సాయంత్రం దీనిపై ప్రధానమంత్రి మోడీ సమాధానమిచ్చారు. “రాహుల్ గాంధీ మణిపూర్ లో భారతమాత హత్య జరిగిందన్నారు.. భారతమాత హత్య అంటే దేశ వినాశనాన్ని కోరుకోవడమే. ఒకసారి భారతమాత హత్య అంటారు.. మరోసారి రాజ్యాంగం హత్య అంటారు.. ఎలాంటి భాష ఇది.. ఓట్లు, రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు పెంచడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది” అని మోడీ విమర్శించారు. విపక్షం ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం తమకు ఎప్పటికీ అదృష్టమేనని ప్రధానమంత్రి అన్నారు. అవిశ్వాస తీర్మానాల వల్ల తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరింత పెరుగుతోందని విపక్షానికి చురకలంటించారు. కేంద్రంపై పదేపదే అవిశ్వాసం పెట్టి విపక్షాలు అభాసుపాలవుతున్నాయన్నారు.

Also read : Iqoo Z7 pro 5G: మార్కెట్ లోకి మరో కొత్త ఐక్యూ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

పేదల ఆకలి గురించి ఆందోళన చెందడం లేదు..

“మీరు (ప్రతిపక్షాలు) పేదల ఆకలి గురించి ఆందోళన చెందడం లేదు.. అధికారం గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నారు. మీరు యువత భవిష్యత్తు గురించి చింతించరు.. మీ భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తారు” అని ఆయన (PM Modi Speech) విమర్శించారు. ఈ పార్లమెంట్ సెషన్ లో తమ ప్రభుత్వం అనేక కీలక బిల్లులను ఆమోదించిందని, వాటిపై ఆసక్తి లేదన్నట్టుగా విపక్షాలు ప్రవర్తించాయని మోడీ చెప్పారు. దేశ ప్రజల పట్ల విపక్షాలు విశ్వాస ఘాతుకానికి ఒడిగట్టాయని మండిపడ్డారు. విపక్ష నేతలు వాళ్లు తీసుకున్న గోతిలో వారే పడుతున్నారని వ్యాఖ్యానించారు. అవిశ్వాసం పెట్టమని ప్రతిపక్షాలకు ఆ భగవంతుడే చెప్పి ఉంటాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “‘మేం మరోసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి రావాలని విపక్షాలు నిర్ణయించాయి. అందుకే ఈ అవిశ్వాసం తీసుకొచ్చాయి” అని ఆయన అన్నారు. ఈక్రమంలో ప్రధాని మాట్లాడుతుండగానే (ఓటింగ్ కు ముందే) సభలోంచి విపక్షాల సభ్యులు వెళ్లిపోయారు. దీంతో మూజువాణి ఓటుతోనే విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఆ తర్వాత సభ వాయిదా పడింది.

అధీర్ రంజన్ చౌదరి పేరును ఎందుకు చేర్చలేదు ?

2018లోనూ అవిశ్వాసం పెట్టారని గుర్తు చేస్తూ.. తమ ప్రభుత్వంపై ప్రజలు అనేకసార్లు విశ్వాసం చూపించారన్నారు. క్రికెట్‌ భాషలో చెప్పాలంటే విపక్షాలు వరుస నోబాల్స్‌ వేస్తుంటే.. అధికార పక్షం ఫోర్లు, సిక్సులు కొడుతోందని వ్యాఖ్యానించారు. “అవిశ్వాస తీర్మానంపై చర్చలో మాట్లాడే వారి జాబితాలో కాంగ్రెస్ లోక్ సభా పక్ష నాయకుడిగా ఉన్న అధీర్ రంజన్ చౌదరి పేరును ఎందుకు చేర్చలేదు ? 1999లో అవిశ్వాస తీర్మానానికి శరద్ పవార్ నాయకత్వం వహించారు. 2003లో అవిశ్వాస తీర్మానానికి సోనియా గాంధీ నాయకత్వం వహించారు. అయితే ఈసారి అధీర్ రంజన్ చౌదరికి ఏమైందో చూడండి? ఆయన్ను లిస్టు నుంచి ఎందుకు పక్కన పెట్టారు? కోల్‌కతా నుంచి కాల్ వచ్చిందేమో.. అధీర్ చౌదరికి మా సానుభూతిని తెలియజేస్తున్నాం” అని ప్రధాని కామెంట్ చేశారు.

Also read : Janasena Merge BJP: జనసేన లోకి చిరు.. పాల్ జోస్యం

చివరకు ఇండియా పేరునూ విభజించారు..

“ప్రభుత్వ బ్యాంకింగ్ వ్యవస్థ అంతం కానుందని ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేసింది. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండింతలు లాభాలు సాధిస్తూ పురోగమిస్తున్నాయి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పనైపోయిందన్నారు. కానీ అలా జరగలేదు!! ఎల్‌ఐసీ కూడా ఎంతో బలపడుతోంది” అని ఆయన వివరించారు. “చివరకు ఇండియా పేరును కూడా వాళ్లు విభజించారు.. ఇండియా కూటమి పేరులోని మొదటి “ఐ” 26 పార్టీల అహంకారానికి ప్రతీక. రెండో “ఐ” అనేది ఒక కుటుంబ అహంకారానికి ప్రతీక” అని మోడీ విమర్శించారు. కుటుంబ రాజకీయాలు, దర్బారు రాజకీయాలే కాంగ్రెస్ కు ఇష్టమన్నారు. ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, యూపీ, కాశ్మీర్, బీహార్ రాష్ట్రాలు కాంగ్రెస్ పై నో కాన్ఫిడెన్స్ ప్రకటించాయన్నారు. “పాక్ మన సరిహద్దులపై దాడి చేస్తుంది. ఉగ్రవాదులను మన దేశంలోకి పంపుతుంది. పాక్‌ను కాంగ్రెస్‌ నమ్ముతుంది. కాంగ్రెస్ హురియత్, ఇతర వేర్పాటువాదులను నమ్ముతుంది . కానీ మన సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులను నమ్మదు” అని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు ఏ.ఓ.హ్యూమ్స్ కూడా విదేశీయుడే అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని వ్యాఖ్య చేశారు. ” కాంగ్రెస్ పార్టీ ఒక ఫెయిల్డ్ ప్రోడక్ట్ ను పదేపదే లాంచ్ చేస్తోంది.. ఆ ప్రోడక్ట్ మళ్లీ మళ్లీ ఫెయిల్ అవుతూనే ఉంటుంది.. వాళ్ల లాంచింగ్ ఫెయిల్ అయినప్పుడల్లా ప్రజలపై ద్వేషం పెంచుకుంటున్నారు” అని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని పేర్కొన్నారు. రాజకుమారుడు ఇప్పుడిప్పుడే కారు అద్దాలు దించి ప్రజల కష్టాలు చూస్తున్నారని కామెంట్ చేశారు.