Site icon HashtagU Telugu

Pawan Kalyan: రైతుల క్షోభ పాలకులకు అర్థం కావడం లేదు….ఆత్మహత్యలు చేసుకుంటున్నా చలనం రాదా? – ‘పవన్ కళ్యాణ్’

pawan kalyan

pawan kalyan

రాష్ట్ర పాలకులకు వ్యవసాయ రంగం మీదా.. రైతుల సంక్షేమం మీదా శ్రద్ధ లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఏ ప్రాంతంలో చూసినా రైతులు, కౌలు రైతులు నష్టాల పాలై మానసిక స్థయిర్యం కోల్పోయి ఉన్నారు. వారి కష్టాలు తెలుసుకొని కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. ఆ బాధ్యతను విస్మరించారు. రైతుల క్షోభ ఏ స్థాయిలో ఉందో పాలకులకు అర్థం కాకపోవడం విచారకరమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సాగు నష్టాలు, అప్పుల భారంతో కుంగిపోయి అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.

శ్రీసత్యసాయి జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన రైతు జయరామిరెడ్డి, నంద్యాల జిల్లా తాటిపాడుకి చెందిన కౌలు రైతు, ఆ గ్రామ ఎంపీటీసీ చిన్న శంకర్, ఎన్టీఆర్ జిల్లా జయంతికి చెందిన ఇప్పల శ్రీనివాసరెడ్డి బలవన్మరణం చెందారని నా దృష్టికి వచ్చింది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
వైసీపీ పాలన మొదలయ్యాక సుమారు మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రైతు ఆత్మహత్య గురించి వింటూనే ఉన్నాం. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా పాలకుల్లో చలనం రాకపోవడం గర్హనీయం. రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వకపోయినా జనసేన అండగా నిలుస్తుంది. కౌలు రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రుణ అర్హత కార్డులు దక్కేలా పోరాడుతుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.