Pawan Kalyan : జనసేన అధినేత , ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల తనకు అందుతున్న విస్తృతమైన ఫిర్యాదుల గురించి సోషల్ మీడియాలో స్పందించారు. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలు, బలవంతపు భూసేకరణ ఘటనలపై అనేక మంది బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇలాంటి ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ముఖ్యంగా కాకినాడ , రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి తమకు ఫిర్యాదులు అందుతున్నాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. బాధితుల ఫిర్యాదులపై సంబంధిత శాఖలు , పోలీసు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కాకినాడ పోలీసుల సహా అన్ని జిల్లాల కలెక్టర్లు , పోలీసు సూపరింటెండెంట్‌లు ఈ సమస్యలను సత్వరంగా పరిష్కరించాలని ఆయన కోరారు.
ఈ ఫిర్యాదులకు ప్రాధాన్యమిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని పవన్ కల్యాణ్ నొక్కి చెప్పారు. ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను నిరోధించేందుకు , బాధితులకు న్యాయం చేయడానికి “ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టం” రూపొందించామని చెప్పారు. ఈ కొత్త చట్టం కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు , టైటిల్ వెరిఫికేషన్ వంటి అంశాలను కలిగి ఉంటుందని తెలిపారు.
మరి ముఖ్యంగా, ఈ చట్టం ద్వారా భూ ఆక్రమణలను అరికట్టి, ప్రభుత్వ వనరులను రక్షిస్తూ, బాధితులకు తక్షణ న్యాయం అందించడంపై తమ ప్రభుత్వం దృఢంగా కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. సమాజంలో భూమి సమస్యలను పరిష్కరించేందుకు తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా సాగుతున్నాయని పవన్ కల్యాణ్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పష్టం చేశారు.