Heavy Rains : ఈశాన్య భారతదేశాన్ని ప్రకృతి ప్రకోపం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జూన్ ప్రారంభంలోనే అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడురోజుల్లో ఈ ప్రాంతాల్లో కనీసం 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
అస్సాంలోని రెండవ అతిపెద్ద నగరం సిల్చార్‌లో జూన్ 1న కురిసిన భారీ వర్షం 132 ఏళ్ల వర్షపాతం రికార్డును చెరిపేసింది. ఒక్కరోజే అక్కడ 415.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇది 1893లో నమోదైన 290.3 మి.మీ. రికార్డును బద్దలుకొట్టింది. ఈ అకాల వర్షాల వెనక ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ద్రోణులు కారణమని భారత వాతావరణశాఖ తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో అస్సాం సహా పక్కరాష్ట్రాల్లో వాతావరణ తీవ్రత పెరిగింది.
IPL Final: ఐపీఎల్ ఫైనల్ కోసం బీసీసీఐ ప్రత్యేక ప్లాన్.. వర్షం వచ్చినా కూడా మ్యాచ్ జరుగుతుందా?
మేఘాలయలో చిరపుంజి (సోహ్రా), మాసిన్రామ్ ప్రాంతాల్లో వరుసగా 796 మి.మీ., 774.5 మి.మీ. వర్షపాతం నమోదై ఆశ్చర్యపరిచాయి. ఆర్‌కేఎం సోహ్రాలో మే 30న ఒక్కరోజే 378.4 మి.మీ. వర్షం కురవగా, ఐదు రోజుల్లో మొత్తం 993.6 మి.మీ. వరుణుడు ఆగ్రహం చూపాడు. మే 31న మిజోరంలో సాధారణ స్థాయికి 1102 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
త్రిపురలో ఆకస్మిక వరదల వల్ల 10 వేల మందికిపైగా బాధితులయ్యారు. మణిపూర్‌లో నదులు ఉప్పొంగడంతో 19 వేల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. 3,365 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
ఈశాన్య రాష్ట్రాలకన్నా ముందు మేఘాలయలోని పైనూర్స్లా, ఖ్లీహ్రియాత్ వంటి ప్రాంతాల్లోనూ ఒక్కరోజు వర్షపాతం 250–300 మి.మీ. దాటింది. 10 జిల్లాల్లో వరదలు, కొండచరియలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నా, వరుణుడు చూపిస్తున్న ప్రతాపంతో ప్రజల జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది.
Janmashtami: ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు? ఆరోజు ఏం చేయాలి?