Nimmagadda Prasad : ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఔషధ రంగంలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఏ సంస్థనైతే 17 ఏళ్ల క్రితం అమ్మేశారో.. మళ్లీ అదే సంస్థను ఆయన కైవసం చేసుకున్నారు. ఇండియాలోని తన వ్యాపారాన్ని విక్రయించేందుకు వియాట్రిస్ అంతర్జాతీయంగా నిర్వహించిన బిడ్డింగ్‌లో నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన ఐక్వెస్ట్ ఎంటర్‌ప్రైజెస్ ప్రాధాన్య ఇన్వెస్టర్‌గా నిలిచింది. ఈ డీల్‌తో నిమ్మగడ్డ ప్రసాద్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఫార్మా రంగంలోకి అడుగు పెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. యాక్టివ్ ఫార్మా స్యూటికకల్స్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) ను వియాట్రిస్ కంపెనీ తయారు చేస్తుంటుంది.
ఒప్పందంలో భాగంగా..
నిమ్మగడ్డ ప్రసాద్, వియాట్రిస్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా వియాట్రిస్‌కు చెందిన ఆరు ఏపీఐ తయారీ యూనిట్లు (హైదరాబాద్, విశాఖపట్నంలో మూడు చొప్పున), హైదరాబాద్‌లోని ఆర్ అండ్ డీ యూనిట్ ఐక్వెస్ట్ పరం కానున్నాయి. ఈ డీల్ పూర్తి కావడానికి 6 నెలల టైం పడుతుందని అంచనా. ఆరు ప్లాంట్ల వార్షికాదాయం సుమారు రూ.6 వేల కోట్లు ఉంటుందని అంచనా. అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకే వియాట్రిస్ తమ అంతర్జాతీయ వ్యాపారాల్లోని వాటాలను విక్రయిస్తోంది. భారత్‌లో మహిళల ఆరోగ్య సేవల వ్యాపారాన్ని స్పెయిన్‌కు చెందిన ఇన్సడ్ ఫార్మాకు వియాట్రిస్ విక్రయించింది. ఐక్వెస్ట్, ఇన్సడ్ డీల్స్ ద్వారా వియాట్రిస్‌కు దాదాపు రూ. 10 వేల కోట్లు సమకూరనున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
గతంలో ఏం జరిగిందంటే.. ?
- గతంలోకి వెళితే.. ఖాయిలాపడ్డ మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్‌ను 2000 సంవత్సరంలో నిమ్మగడ్డ ప్రసాద్ కొన్నారు. ఆరేళ్లలోనే దాన్ని బిలియన్ డాలర్ల కంపెనీగా తీర్చిదిద్దారు.
- 2006లో ఫార్మా దిగ్గజం మైలాన్ కంపెనీ రూ.9వేల కోట్లకు మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్‌ను కొనుగోలు చేసింది.
- 2013లో మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్ పేరును మైలాన్ ల్యాబ్స్‌గా మార్చారు.
- 2020 నవంబర్‌లో అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌కు చెందిన ఆప్ పేటెంట్ మెడిసిన్ విభాగం అప్‌జాన్‌ను విలీనం చేసుకుని వియాట్రీస్‌గా పేరును మార్చుకుంది.
- ప్రస్తుతం అమెరికా కేంద్రంగా సేవలందిస్తున్న వియాట్రిస్‌కు పిట్స్‌బర్గ్, షాంఘై, హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాలు(Nimmagadda Prasad) ఉన్నాయి.