Monsoon Telangana : నైరుతి రుతుపవనాలపై కొత్త అప్ డేట్ వచ్చింది.. నైరుతి రుతుపవన మేఘాలు జూన్ 22 నాటికి తెలంగాణకు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. జూన్ 26-27 నాటికి తెలంగాణ రాష్ట్రం అంతటా వర్షాలు విస్తరిస్తాయని అంచనా వేసింది. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల కదలిక తెలంగాణలోని ఉత్తర, మధ్య జిల్లాల్లో సాధారణంగా ఉంటుంది.దీనివల్ల అక్కడ సాధారణ స్థాయిలో వానలు(Monsoon Telangana) కురుస్తాయి. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలతో సహా దక్షిణాది జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. వచ్చే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.
Also read : 41 Women Prisoners Killed : 41 మంది మహిళా ఖైదీల హత్య.. హోండురస్ జైలులో దారుణం
దేశంలోని 16 రాష్ట్రాల్లో కూడా..
వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. రాబోయే 15 రోజుల్లో దేశంలోని సగం కంటే ఎక్కువ (16) రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి. సోమవారం నుంచే కొన్ని రాష్ట్రాల్లో వానలు మొదలయ్యాయి. ఢిల్లీ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, అస్సాం, సిక్కింలలో వర్షం కురిసింది. రాబోయే 24 గంటల్లో సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. బిపర్జాయ్ తుఫాను మన దేశంలో వర్షాభావాన్ని భర్తీ చేస్తోంది. దీని ఎఫెక్ట్ తో వాయవ్య భారతదేశంలో కోటా కంటే 37% ఎక్కువ వర్షం కురిసింది. బిపర్జాయ్ వల్ల గత నాలుగు రోజుల్లో గుజరాత్, రాజస్థాన్‌లలో చాలా వర్షాలు కురిశాయి. ఫలితంగా రుతుపవనాల బలహీనత కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడిన వర్షపాతం లోటులో 20 శాతం భర్తీ అయింది.
రుతుపవనాలు వచ్చి 19 రోజులైనా..
సాధారణంగా మన దేశంలో రుతుపవనాల సీజన్ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈసారి రుతుపవనాలు 8 రోజులు ఆలస్యంగా కేరళకు చేరాయి. దీని ప్రకారం వర్షాకాల సీజన్ ప్రారంభమై 19 రోజులు గడుస్తున్నా కురవాల్సిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ సీజన్‌లో దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 21%, మధ్య భారతదేశంలో 56%, దక్షిణాదిలో 61% తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తం దేశంలో సగటున 33% వర్షపాతం నమోదైంది.