TG : రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచే ఆలోచనలేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. వచ్చే నెల 7న ఐటీ, ఇండస్ట్రీ సెక్టార్‌లో ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలిపారు. కొత్త ఐటీ పాలసీను విడుదల చేసి రాష్ట్రాన్ని ఆ రంగంలో దేశంలో అగ్రగామిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కంటే కాంగ్రెస్ హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి లాజిస్టిక్స్ కీలక భూమిక పోషిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నార్త్ కారిడార్ కేంద్రంగా డ్రైపోర్ట్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ డ్రైపోర్ట్‌ను అభివృద్ధి చేయనున్నామని, ఇందుకు సంబంధించిన అనుమతులు ఇప్పటికే పొందినట్లు తెలిపారు. త్వరలోనే తెలంగాణలో రెండు డ్రైపోర్టులు ప్రారంభం కానున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రం కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, టైర్-2 నగరాల్లో పరిశ్రమలు, ఐటీ అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రిటైర్మెంట్ వయస్సును పెంచే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు.