Megastar Chiranjeevi : త్వరలోనే మోడీ కేబినెట్‌లో మెగాస్టార్ చిరంజీవి మంత్రి కాబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. 2025 జూన్ లో ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఒకటి చిరంజీవికి కేటాయించే అవకాశం ఉందని కాషాయ పార్టీ వర్గాల సమాచారం. చిరుని పార్టీలోని చేర్చుకుని రాజ్యసభకు పంపించాలని బీజేపీ ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో కాపుల ఓట్లు చిరు, పవన్ ద్వారా వస్తాయని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి కాపులందరూ ఓట్లేయకపోయినా పోలైన సుమారు 70 లక్షల ఓట్లలో కాపుల ఓట్లే ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే.
నిన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో తన నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోడీతో పాటుగా జాతీయ స్థాయిలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధానిమోడీకి కిషన్‌రెడ్డితో పాటుగా చిరంజీవి సాగర స్వాగతం పలికారు. దీంతో చిరంజీవి బీజేపీకి చాలా దగ్గరవుతున్నారన్న చర్చ నడుస్తోంది. ఘనంగా జరిగిన కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ ఉత్సవాలు జరిగాయి. బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు కూడా హాజరయ్యారు.
కాగా, మెగాస్టార్ చిరంజీవి పై ఈ ప్రచారం కొత్తేమీ కాదు. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార సభకు మోడీ, చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై ప్రధాని మోడీ, (చిరంజీవి, పవన్) ఇద్దరిని చెరో పక్కన ఉంచుకుని వారి చేతులు పైకి లేపి విజయ సంకేతాన్ని జనాలకు చూపించారు. దీంతో అప్పటినుంచి చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారు.. మోడీ కేబినెట్ లో మంత్రిగా చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. దీనికి తోడు కేంద్రం చిరంజీవిని అత్యున్నత పురస్కారంతో సత్కరించడంతో ఆ వార్తలకు మరింత ఊపందుకుంది.