Kharif : ఖ‌రీఫ్‌లో విత్తనాలు, ఎరువుల కొర‌త‌.. తీవ్ర ఆందోళ‌నలో రైతులు

  • Written By:
  • Updated On - July 2, 2022 / 09:48 AM IST

రాజమహేంద్రవరం: గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ తూర్పుగోదావరి జిల్లా ఇప్ప‌టికే పొలం పనులు సందడిగా సాగి, నాట్లు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఇంకా ప‌నులు కొనసాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగానే వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు చెప్తున్న దానిని రైతులు కొట్టిపారేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరసమైన ధరలకు అందడం లేదని వారు వాపోతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. గతంలో ఎరువులకు ఎకరాకు రూ.800 ఖర్చు అయితే ఇప్పుడు ఎకరాకు రూ.2 వేలు ఖ‌ర్చు అవుతుంద‌ని రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పురుగుమందుల ధర రెట్టింపు అయింద‌ని.. ఇంధన ధరల పెరుగుదల, ట్రాక్టర్లు మరియు యంత్రాల ధరలు కూడా పెరిగిపోవ‌డంతో ఇన్‌పుట్ ఖర్చు పెరిగిందని రైతులు తెలిపారు.

ఖరీఫ్‌ పనులకు ముందస్తుగా నీటిని విడుదల చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అందని ద్రాక్షగానే మిగిలింది. గత ఖరీఫ్, రబీ పంటలకు ప్రభుత్వం ఎంఎస్‌పీని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేకపోయింది. వరి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతులకు డబ్బులు అందుతాయని అధికారులు చెప్పిన‌ప్ప‌టికి ఇప్ప‌టికీ ఆ డ‌బ్బులు రైతుల‌కు అంద‌లేదు. జిల్లాలోని కోరుకొండ మండలానికి చెందిన మెట్టభూమికి చెందిన తనకాల నాగేశ్వరరావు అనే రైతు తాను నవంబర్ చివరి వారంలో రైతు భరోసా కేంద్రంలో వరి ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి దాదాపు రూ.8 లక్షలు రావాల్సి ఉందని.. అయితే చాలా రోజుల‌కు త‌న ఖాతాలో రూ.6 లక్షలు జమకాగా మరో రూ.2 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని రైతు తెలిపారు. చాలామంది రైతుల ప‌రిస్థితి ఇదే విధంగా ఉండ‌టంతో ఖరీఫ్‌ సాగుకు పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ జిల్లాలో మొత్తం 18 మండలాల్లో 82,000 హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంది. ఇందులో 79 వేల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. మిగిలిన విస్తీర్ణంలో చెరకు, పసుపు, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు పండిస్తున్నారు. ఇప్పటి వరకు 26 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు మాట్లాడుతూ జూలై నెలాఖరు నాటికి నూరుశాతం నాట్లు పూర్తవుతాయని తెలిపారు.