Site icon HashtagU Telugu

Asia Cup 2023: మళ్లీ కుల్దీప్ మ్యాజిక్… లంకపై గెలుపుతో ఫైనల్లో భారత్

Asia Cup 2023

New Web Story Copy 2023 09 12t232527.268

Asia Cup 2023: ఆసియా కప్ లో భారత్ జోరు కొనసాగుతోంది. సూపర్ 4 తొలి మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన టీమిండియా తాజాగా లంకను ఓడించింది. ఆసక్తికరంగా సాగిన పోరులో 41 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్లో అడుగు పెట్టింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్ ధాటిగా ఆడి కేవలం 11 ఓవర్లలోనే 81 పరుగులు జోడించారు. రోహిత్ భారీ సిక్సర్‌ తో వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. వీరిద్దరి జోరు చూసి మరోసారి భారీ స్కోర్ ఖాయమని అనుకున్నారు. అయితే పవర్ ప్లే తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ అనూహ్యంగా కుప్పకూలింది. 11 రన్స్ తేడాలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. కోహ్లి నిరాశ పరిచాడు. రోహిత్ హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాక కే ఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ పార్టనర్ షిప్ తో కాస్త కోలుకున్నట్టు కనిపించినా…కీలక సమయంలో లంక స్పిన్నర్లు మరోసారి చెలరేగారు. ఫలితంగా భారత్ ఇన్నింగ్స్ 213 పరుగులకు ముగిసింది. లంక స్పిన్నర్లు దునిత్ వెల్లలాగే 5 చరిత్ అసలంక 4 వికెట్లు పడగొట్టారు.

పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలోనే భారత పేసర్ బుమ్రా 2 వికెట్లు తీసి లంకను దెబ్బతీసాడు. ఇక్కడ నుంచి లంకను క్రమం తప్పకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ , జడేజా కూడా రాణించడంతో శ్రీలంక 99 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయింది. అయితే ధనుంజయ్‌ డిసిల్వ, వెల్లలాగే కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. వీరిద్దరూ నిలకడగా ఆడడంతో రన్ రేట్ పడిపోకుండా లంక ఇన్నింగ్స్ సాగింది. ఈ దశలో జడేజా వీరి పార్టనర్ షిప్ ను బ్రేక్ చేశాడు. తర్వాత వెల్లలాగే పోరాడినా…చివరి వరుస బ్యాటర్లు సపోర్ట్ ఇవ్వలేక పోవడంతో లంకకు ఓటమి తప్పలేదు. చివరి రెండు వికెట్లు తీసిన కుల్డీప్ ఈ మ్యాచ్ లో మొత్తం 4 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తన తర్వాతి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతుంది.

Also Read: Rohit Sharma: రోహిత్ @ 10000… హిట్ మ్యాన్ అరుదైన రికార్డు