Koneru Konappa : కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. స్థానిక ఎన్నికల ముందు పార్టీని వీడడంతో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కోనేరు కోనప్ప గతేడాది మార్చి 6న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపై ఏ పార్టీలో కాకుండా స్వతంత్రంగా ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్‌ను వీడినట్లు తెలిపారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతకు ప్రకటించలేదు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు.
Read Also: Man With 5 Kidneys: ఈయన శరీరంలో ఐదు కిడ్నీలు.. ఎవరు ? ఎలా ?
కోనేరు కోనప్ప 2024 ఎన్నికల్లో బీఎస్సీ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవగా.. 2023 ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేయగా.. బీజేపీ చేతిలో ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల సమయంలో తనపై పోటీ చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో అసంతృప్తితో గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఏడాది తిరక్కుండానే కాంగ్రెస్‌కు బై బై చెప్పారు.
కాగా, ఇటీవల కోనప్ప ఓ సభలో తాను వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ నిర్ణయమైనా ప్రజల ముందే తీసుకుంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ దేవుడిలా వంతెన, రోడ్లు, అభివృద్ధి పనులు మంజూరు చేస్తే వాటిని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కోనప్ప తిరిగి బీఆర్ఎస్ పార్టీకి దగ్గరయ్యే అవకాశం ఉందంటూ రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఆయనకు టిక్కెట్ గ్యారంటీ ఉంటేనే ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి.