తెలంగాణ భవన్(Telangana Bhavan)లో నేడు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం (State Executive Committee Meeting) జరుగుతోంది. దాదాపు ఆరు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) రానుండటంతో రాజకీయంగా ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, సభ్యత్వ నమోదు, నాయకత్వ మార్పులు, సంస్థాగత నిర్మాణాలపై కేసీఆర్ స్పష్టమైన మార్గదర్శకాలు అందించనున్నారు.
Kashmir : కశ్మీర్ కు తీవ్ర ముప్పు పొంచివుందా?
బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించనున్నారు. ముఖ్యంగా ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు పార్టీ ఉద్దేశాలు, విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై అవగాహన కల్పించనున్నారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజల హక్కులను కాపాడే దిశగా చైతన్య కార్యక్రమాలను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయనున్నారు.
Maha Kumbh Mela 2025 : YuppTV CEO పాడి ఉదయ్ రెడ్డి పవిత్ర స్నానం
ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ దృష్టిసారించనుంది. ఎన్నికల హామీలు అమలు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సమీక్షించి, ప్రజల్లో చైతన్యం కలిగించే వ్యూహాలను సిద్ధం చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, తమ హక్కులను సాధించుకునే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపట్టేలా పార్టీ నాయకత్వం ప్రణాళికలు రూపొందించనుంది. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ముందుకు సాగే మార్గాన్ని కేసీఆర్ ఈ సమావేశంలో సూచిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.