Abusive Words Against PM : కర్ణాటక హైకోర్టు ఒక కేసులో సంచలన తీర్పు వినిపించింది.
“ప్రధానమంత్రికి వ్యతిరేకంగా దుర్భాషలాడడం అనేది ఆ పదవిని అవమానించడం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం కిందికి వస్తుంది. అది దేశద్రోహంగా పరిగణించబడదు” అని కర్ణాటక హైకోర్టులోని కల్బుర్గి బెంచ్ చెందిన జస్టిస్ హేమంత్ చందన్ గౌడర్ పేర్కొన్నారు.
2020 సంవత్సరంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యకర్త నీలేష్ రక్షల ఫిర్యాదు మేరకు బీదర్‌లోని షాహీన్ స్కూల్ మేనేజ్‌మెంట్ వ్యక్తులు అల్లావుద్దీన్, అబ్దుల్ ఖాలిక్, మహమ్మద్ బిలాల్ ఇనామ్‌దార్, మహమ్మద్ మెహతాబ్‌లపై బీదర్ న్యూ టౌన్ పోలీసులు నమోదు చేసిన దేశద్రోహం కేసును కోర్టు రద్దు చేసింది. మత గ్రూపుల మధ్య హింసను రేకెత్తించే అంశాలు ఈ కేసులో కనిపించలేదని(Abusive Words Against PM).. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 153(ఎ)ను ఈ పిటిషన్ లో ప్రస్తావించడం సరికాదని కోర్టు పేర్కొంది. “ప్రభుత్వ విధానంపై నిర్మాణాత్మక విమర్శలు చేయొచ్చు. కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నందుకు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని అవమానించేలా మాట్లాడకూడదు” అని జస్టిస్ హేమంత్ చందన్ గౌడర్ తన తీర్పులో సూచించారు.
2020 జనవరి 21న 4, 5, 6 తరగతుల విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (NRC)కి వ్యతిరేకంగా నాటకాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత పాఠశాల నిర్వాహకుల్లో ఒక వ్యక్తి ఆ నాటకం వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అప్పట్లో దీన్ని చూసిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యకర్త నీలేష్ రక్షల వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విధంగా నమోదైన కేసును ఇప్పుడు కోర్టు కొట్టేసింది.