Site icon HashtagU Telugu

Kamal Haasan: ‘థగ్ లైఫ్’ రిలీజ్‌ కష్టమేనా..?

Kamal

Kamal

Kamal Haasan: కన్నడ భాషపై కమలహాసన్ చేసిన వ్యాఖ్యల వివాదం కర్ణాటక రాష్ట్రంలో తీవ్రమవుతోంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ విడుదలపై ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయాలంటే కమల్ హాసన్ తప్పకుండా క్షమాపణ చెప్పాలని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి తీవ్ర స్థాయిలో స్పందించారు.

Casting Couch : ఓ డైరెక్టర్ ముద్దు పెట్టబోయాడు – ‘రానా నాయుడు’ నటి

“నేను ఇప్పటికే కమల్ వ్యాఖ్యలపై అధికారికంగా లేఖ రాసిన విషయం తెలిసిందే. అలాగే, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న నిర్ణయం సర్వత్రా అభినందనీయం. కమల్ హాసన్ రెండు రోజుల్లో క్షమాపణ చెబితే బాగుంటుంది, లేకపోతే ఆయన సినిమాలన్నింటినీ నిషేధిస్తామని స్పష్టంగా తెలిపాం,” అని మంత్రి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఫిల్మ్ ఛాంబర్‌ను అభినందిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.

ఇక ఈ వివాదంపై కమల్ హాసన్ తన ధోరణిలో మార్పు తీసుకురాలేదు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి ఒత్తిళ్లూ, బెదిరింపులూ తనకు కొత్త కావని, 2013లో తన “విశ్వరూపం” చిత్రం తమిళనాడులో 15 రోజుల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నదే దీనికి ఉదాహరణగా గుర్తు చేశారు.

‘థగ్ లైఫ్’ చిత్రానికి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శింబు (ఎస్టీఆర్), త్రిష, సన్యా మల్హోత్రా, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. జూన్ 5న ఈ సినిమాను అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో ఈ చిత్రం విడుదలపై స్పష్టత కనిపించడం లేదు. కమల్ హాసన్ క్షమాపణ చెబుతారా? లేదా ఈ వివాదం సినిమాపై, వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Fortuner: నదిలో ఇరుక్కున్న కారు… శంకరనారాయణన్ వచ్చాడు, లాగేశాడు!