Joe Bidens son Hunter: నేరాన్ని అంగీక‌రించిన అమెరికా అధ్య‌క్షుడు జో బిడెన్ కొడుకు.. తుపాకీ కూడా ఉంద‌ట‌..

అమెరికా అధ్య‌క్షుడు జో బిడెన్ కుమారుడు హంట‌ర్ బిడెన్ త‌న నేరాన్ని అంగీక‌రించాడు. ప‌లుమార్లు ఫెడ‌ర‌ల్ ఇన్‌క‌మ్ ట్యాక్స్ చెల్లించ‌లేదంటూ నేరాన్ని స్వ‌యంగా అంగీక‌రించాడు.

  • Written By:
  • Updated On - June 20, 2023 / 10:25 PM IST

అమెరికా అధ్య‌క్షుడు జో బిడెన్ (Joe Biden) కుమారుడు హంట‌ర్ బిడెన్ (Hunter Biden) త‌న నేరాన్ని అంగీక‌రించాడు. ప‌లుమార్లు ఫెడ‌ర‌ల్ ఇన్‌క‌మ్ ట్యాక్స్ చెల్లించ‌లేదంటూ నేరాన్ని స్వ‌యంగా అంగీక‌రించాడు. త‌న‌పై ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి జ‌స్టిస్ డిపార్ట్ మెంట్‌తో జ‌రిగిన డీల్‌లో ఈ విష‌యాన్ని ఒప్పుకున్నాడు. అమెరికా (America) లో డ్ర‌గ్స్ వినియోగిస్తున్న వ్య‌క్తులు తుపాకీ క‌లిగి ఉండ‌టం నేరం. కానీ, జో బిడెన్ కుమారుడు మాత్రం డ్ర‌గ్స్ వాడుతున్న‌ప్ప‌టికీ చ‌ట్ట‌విరుద్దంగా తుపాకీ క‌లిగి ఉన్నాడు. ఈ మేర‌కు హంట‌ర్ బిడెన్, యుఎస్ లాయ‌ర్లు మ‌ధ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఈ అగ్రిమెంట్‌ల‌ను ఫెడ‌ర‌ల్ జ‌డ్జి ఆమోదించాల్సి ఉంది.

హంట‌ర్ బిడెన్‌కు ప్ర‌స్తుతం 53ఏళ్లు. అత‌ను లాయ‌ర్‌గా, లాబీయిస్టుగా, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక‌ర్‌గా ప‌నిచేశాడు. కొన్నేళ్లుగా హంట‌ర్ బిడెన్ వ్యాపార లావాదేవీల‌పై రిప‌బ్లిక్ చ‌ట్ట స‌భ్యుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అత‌నిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల ప్ర‌కారం.. 2017, 2018 సంవ‌త్స‌రాల్లో ఆయ‌న సంపాద‌న 1.5 మిలియ‌న్ డాల‌ర్ల‌పైనే ప‌న్ను క‌ట్ట‌లేదు. ఈ రెండు సంవ‌త్స‌రాల్లో ఆయ‌న ఒక ల‌క్ష డాల‌ర్ల‌కుపైగా క‌ట్టాల్సి ఉంది. ఒక్కో ఏడాదికి ప‌న్ను క‌ట్ట‌నందుకు 12 నెల‌లు జైలు శిక్ష‌, ఒక ల‌క్ష డాల‌ర్ల జ‌రిమానా ప‌డే అవ‌కాశం ఉంది. అయితే, చ‌ట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆయ‌న సంపాదించిన దానికి రెట్టింపు చెల్లించాల‌నే రూల్‌కూడా ఉంది. ఈ క్ర‌మంలో హంట‌ర్ బిడెన్‌ ఎలాంటి జైలు శిక్ష అనుభ‌వించే అవ‌కాశాలు లేవ‌ని తెలుస్తోంది.

హంట‌ర్ బిడెన్ నేరాల‌ను అంగీక‌రించ‌డంపై జో బిడెన్‌, అమెరికా ఫ‌స్ట్ లేడీ జిల్ బిడెన్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. జో బిడెన్‌, జిల్ బిడెన్ వారి కొడుకును ప్రేమిస్తున్నార‌ని, హంట‌ర్ త‌న జీవితాన్ని పునః నిర్మించుకోవ‌డానికి మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని శ్వేత‌సౌధం ప్ర‌తినిధి ఇయాన్ సామ్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించారు.

Himalaya Mountains: క‌రుగుతోన్న హిమాల‌యాలు.. రాబోయే రోజుల్లో జ‌లప్ర‌ళ‌యం త‌ప్ప‌దా..? తాజా నివేదిక‌లు ఏం చెప్పాయంటే?