KTR : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. దీంతో తెలంగాణ అసెంబ్లీ నుండి జగదీశ్ రెడ్డిని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు. అయితే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ…జగదీశ్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగా సభ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. స్పీకర్ పట్ల జగదీశ్‌రెడ్డి అగౌరవంగా మాట్లాడలేదు. అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో ఏమీ మాట్లాడకపోయినా.. ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేయడం దారుణం అని కేటీఆర్ అన్నారు.
Read Also: Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్
ఇదే విషయాన్ని స్పీకర్, మంత్రి శ్రీధర్‌బాబుకు స్పష్టంగా చెప్పాం. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని కోరాం. అయినా, పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలతో సభను 5 గంటలపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులతో మాట్లాడించి.. జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటారు అని కేటీఆర్ అన్నారు. స్పీకర్ పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాను చేసిన తప్పేంటని వివరణ అడిగే అవకాశం కూడా జగదీశ్‌రెడ్డికి ఇవ్వలేదు. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేయాలని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ అన్నారు.
మరోవైపు సభాపతిపై జగదీశ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి సీతక్క శాసన సభలో ప్రతిపాదించారు. శాసన వ్యవస్థను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించాలని సూచించారు. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని శ్రీధర్ బాబు ప్రతిపాదించగా, స్పీకర్ ఆమోదించారు.