రష్యా-ఉక్రెయిన్ యుద్దం మొదలవ్వకముందే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఆరోగ్యంపై యూరప్ దేశాలతోపాటు మరికొన్ని దేశాలు సంచలన కథనాలు వెలువరుస్తున్నాయి. రష్యా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా సరే.. ఈ కథనాలకు అడ్డే లేకుండా పోయింది. ఇప్పుడు కూడా అలాంటిదే బయటకు వచ్చింది. పుతిన్ క్యాన్సర్ తో తీవ్రంగా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారి అయిన బోరిస్ కార్పిచ్కోవ్ పుతిన్ ఆరోగ్యంపై కీలక ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం.. పుతిన్ రెండు నుంచి మూడేళ్లకు మించి బతకరని.. వైద్యులు చెప్పినట్టుగా ఈ ప్రకటన ఉంది.
పుతిన్ కు తీవ్రమైన తలనొప్పి వస్తోందని, నెమ్మదిగా కంటి చూపు కూడా సన్నగిల్లుతోందని.. క్యాన్సర్ పెరిగిందని.. అందుకే ఆయన ఆరోగ్యం క్షిణిస్తున్నట్టు ఆ ప్రకటనలో ఉంది. సమావేశాలను పూర్తిచేయకుండా మధ్యలోనే వెళ్లిపోతున్నారని.. ప్రసంగాల కోసం అక్షరాలను పెద్దగా రాసివ్వాల్సి వస్తోంది అన్నారు. పైగా ఈమధ్య కాళ్లు, చేతులు కూడా వణుకుతున్నాయని అందుకే ఆయన మరో మూడేళ్లకు మించి బతకరని వైద్యులు అంచనా వేసినట్లు ఆ ప్రకటన చెబుతోంది.
పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులు పెరిగిపోవడంతో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ వాటిని తీవ్రంగా ఖండించారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. వదంతులను నమ్మవద్దని చెప్పారు. ఆయనకు ఎలాంటి వ్యాధి లేదని.. అలాంటప్పుడు ఇలాంటి ప్రచారం తగదని హితవు పలికారు. పుతిన్ కు వచ్చే అక్టోబర్ నాటికి 70 ఏళ్లు పూర్తవుతాయి. అయినా సరే ఆయన ఆరోగ్యం విషయంలో ఎక్కడా రాజీపడరు. పైగా ఎప్పుడూ ఏదో కార్యక్రమంలో కనిపిస్తూనే ఉన్నారు కదా అని ఆయన చెప్పారు. దీంతో పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టడానికి ప్రయత్నించారు.