Site icon HashtagU Telugu

May Day 2022: కార్మిక లోకం వర్ధిల్లాలి!

Workers

Workers

దేశదేశాల కార్మిక వీరులు శ్రమ విముక్తికై
తమ నెత్తురు ధారపోసిన అచంచల పోరాట దీక్షను
గుర్తు చేసుకునే రోజిది.
సమసమాజ భవిష్యత్ చిత్ర పటాన్ని
రచించుకోవలసిన రోజిది.
బూర్జువా ప్రజాస్వామ్యం అని మనం ఈసడించే దానిలో ప్రజాస్వామ్యం ఈ మాత్రం వుందన్నా ,
దానికి శ్రామిక వర్గ పోరాటాలే కారణం.
మనుషులచే , గొఢ్ల కన్నా అధ్వాన్నంగా రోజుకు 16 గంటలు పని చేయించుకున్న సిగ్గులేని పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ రోజు తానేదో ప్రజాస్వామ్యానికి ఛాంపియన్ గా ఫోజులు గొడుతోంది.
దాని అబద్ధాల ముసుగు చించాల్సిన రోజిది.
ప్రజాస్వామ్యం , హక్కులూ , మహిళా సమానత్వం ,ఉద్యోగ భద్రత , సార్వత్రిక విద్య , ఆరోగ్యం ఇలా నాగరికమైన అన్ని అంశాలూ , మానవాళికి కార్మిక వర్గం అందించిన కానుకలే.
ఆ కానుకలను హాయిగా అనుభవిస్తూ , పెట్టుబడిదారీ వ్యవస్థకు మద్దతిచ్చే నయవంచకులను ఎండగట్టాల్సిన రోజిది.

పెట్టుబడిదారీ దోపిడి నుండీ ,
పర్యావరణ విధ్వంసం నుండీ ,
వెకిలి ధనస్వామ్య సంస్కృతి నుండీ ,
అంతరాత్మ చచ్చిన డొల్లతనాల నుండీ
మానవాళిని కాపాడేది
కేవలం కార్మిక వర్గం మాత్రమే అని
ఎలుగెత్తి చాటాల్సిన రోజిది.
షికాగో అమరులనుండీ , ఫూలే , లోఖండే వరకూ
కార్మికులను సంఘటితం చేయడంలో
జీవితాలనే అర్పించిన నాయకులందరినీ
తలుచుకోవలసిన రోజిది.
మారిన పరిస్థితుల్లో శ్రమ విముక్తి పోరాటాన్ని
ముందుకెలా తీసుకు పోవాలో
కొత్త వ్యూహాల గూర్చి మేధో మధనం
చేయాల్సిన రోజు.
ఈ దేశాన్ని ఫాసిజం కోరల నుండీ తప్పించడంలో..
వామపక్షం పోషించాల్సిన పాత్ర గురించి లోతుగా చర్చించుకోవలసిన రోజిది.
జోహార్లు అమరవీరులారా !!

Lines by : Bhargava G