దేశంలో సామాన్య మహిళలకే కాదు..ఉన్నత స్థాయి మహిళా అధికారులకు సైతం వేదింపులు తప్పడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో మరో మహిళా ఐఏఎస్ (Female IAS officer) కూడా వేధింపులకు గురికావడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ శాఖలో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆమెను కలవాలని శివప్రసాద్ అనే వ్యక్తి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. తాను మహిళా ఐఏఎస్‌కి వీరాభిమానిని అని పేర్కొంటూ, సోషల్ మీడియాలో కూడా ఆమెను ఫాలో అవుతున్నాడు.
గత నెల 22న కూడా మహిళా ఐఏఎస్‌లను కలిసేందుకు ఆమె విధులు నిర్వహిస్తున్న కార్యాలయానికి వెళ్లాడు. అయితే శివప్రసాద్ (Shivaprasad) తరచూ తనను కలవడానికి వస్తున్నాడని తెలుసుకున్న మహిళా ఐఏఎస్.. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పంపవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో బుధవారం (సెప్టెంబర్ 13) నేరుగా మహిళా ఐఏఎస్ ఉంటున్న ఇంటి చిరునామాను తెలుసుకుని శివప్రసాద్ అక్కడికి వెళ్లాడు. మేడం కోసం స్వీట్ బాక్స్ తీసుకొచ్చానని , ఆ బాక్స్ ఇచ్చి వెళ్లిపోతానని సిబ్బందికి చెప్పాడు. మేడమ్‌ని ఒకసారి చూసి కలిసి వెళతాను అన్నాడు. ఈ విషయాన్ని సిబ్బంది బాధిత ఐఏఎస్‌కు తెలియజేయడంతో.. లోపలికి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు.
దీంతో సిబ్బంది శివప్రసాద్‌ను అక్కడి నుంచి పంపించారు. అయితే శివప్రసాద్ నుంచి ఇలాంటి వేధింపులు రావడంతో ఐఏఎస్ అధికారి కార్యాలయ అదనపు డైరెక్టర్ సికింద్రాబాద్‌లోని మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు శివప్రసాద్‌పై పోలీసులు 354డి కింద కేసు నమోదు చేశారు. అధికారులే ఇలాంటి వేధింపులకు బలవుతుంటే ఇక సామాన్య ప్రజలకు దిక్కెవరని ఈ వార్త చూసిన వారంతా అంటున్నారు.