Site icon HashtagU Telugu

Hyderabad Metro: చారిత్రాత్మక మైలురాయికి చేరుకున్న హైద‌రాబాద్ మెట్రో .. అదేమిటంటే?

Hyderabad Metro

Hyderabad Metro

హైద‌రాబాద్ మెట్రో (Hyderabad Metro) కు రోజురోజుకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. కొత్త‌కొత్త స్కీంల‌తో ప్ర‌యాణికులను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం మెట్రో యాజ‌మాన్యం చేస్తుండ‌టంతో మెట్రోలో ప్ర‌యాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ కోవ‌లో హైద‌రాబాద్ మెట్రో రైలు చారిత్రాత్మ‌క మైలురాయిని చేరుకుంది. జూలై 3వ తేదీ (సోమ‌వారం) ఒక్క‌రోజే మెట్రోలో 5.10ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించిన‌ట్లు మెట్రో రైల్ అధికారులు తెలిపారు. ఒక్క‌రోజే ఇంత భారీ స్థాయిలో ప్ర‌యాణికులు ప్ర‌యాణించ‌డం ఇదే తొలిసారి.

నాగోల్ నుంచి హైటెక్ సిటీ, ఎల్బీన‌గ‌ర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లి రూట్ల‌లో భారీ సంఖ్య‌లో ప్ర‌యాణికులు ప్ర‌యాణించారు. తాజా లెక్క‌ల ప్ర‌కారం.. హైద‌రాబాద్ మెట్రో రైలులో ఇప్ప‌టి వ‌ర‌కు 40కోట్ల మంది ప్ర‌యాణికులు త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకున్నారు. తాజా మైలురాయిని సాధించినందుకు ప్రయాణీకులకు L&TMRHL ఎండీ అండ్ సీఈవో కేవీబీ రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కొవిడ్ -19 మ‌హ‌మ్మారి మెట్రోపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపింది. కానీ, మా సిబ్బంది స్థిరమైన ప్రయత్నాలు, కృషి ద్వారా నేడు మేము ఈ విజయాన్ని చ‌విచూడ‌గ‌లిగామ‌ని కేవీబీ రెడ్డి అన్నారు.

2017లో న‌వంబ‌ర్ 29న ప్రారంభ‌మైన హైద‌రాబాద్ మెట్రోలో సౌకర్యవంతమైన, అత్యంత సుఖవంతమైన ప్రయాణ విధానం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నార‌ని, ఫ‌లితంగా ప్ర‌తీయేటా మెట్రోలో ప్ర‌యాణికుల సంఖ్య పెరుగుతోంద‌ని, త‌ద్వారా ఒకేరోజు ఐదు ల‌క్ష‌ల‌కుపైగా ప్ర‌యాణికులు ప్ర‌యాణించిన ఘ‌న‌తను సాధించామ‌ని అన్నారు. మున్ముందు ప్ర‌యాణికుల‌కు మ‌రిన్ని నాణ్య‌మైన‌ సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చి మెట్రోలో రోజువారి ప్ర‌యాణికులు పెరిగే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని చెప్పారు.

Garuda Puranam: మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా సాగుతుందో మీకు తెలుసా?