మరికాసేపట్లో ఏపీకి 4 వ సారి సీఎం గా చంద్రబాబు (Chandrababu) ప్రమా స్వీకారం చేయబోతున్నారు. అలాగే చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి (Kesarapalli ) ఐటీ పార్కు వద్ద ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ , కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అగ్రనటులు చిరంజీవి, రజినీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు హాజరుకాబోతున్నారు. కూటమిలోని మూడు పార్టీల నుంచి ఎంపికైన ప్రజాప్రతినిధులు సహా నేతలు, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు. ఉదయం 6 గంటలకే పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు ప్రాంగణానికి చేరుకోవడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలిరావడంతో రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. పలుచోట్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
We’re now on WhatsApp. Click to Join.
ప్రధాని మోడీ సహా ప్రముఖులు హాజరు కానుండటంతో విజయవాడ లో పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడలోకి వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. కనకదుర్గ వారధిపై బారికేడ్లు అడ్డుపెట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ-గన్నవరం మార్గంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలతో కార్యకర్తలు, అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ రుసుం కోసం వాహనాలను సిబ్బంది నిలిపివేశారు. దీంతో సుమారు 2కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్‌తో ప్రమాణస్వీకారానికి వెళ్లేందుకు కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడుతున్నారు.
Read Also : AP Cabinet : కులాలవారీగా ఏపీ మంత్రుల వివరాలు..