Site icon HashtagU Telugu

Harish Rao : కంది రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం : హరీశ్‌రావు

Harish Rao letter to CM Revanth Reddy

Harish Rao letter to CM Revanth Reddy

Harish Rao : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సుమారు 6 లక్షల ఎకరాల్లో 2.5లక్షల మెట్రిక్‌ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని హరీశ్‌రావు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై 400 రూపాయల బోనస్‌ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో భాగంగా కందులకు మద్దతు ధరతో పాటు అదనంగా 400 రూపాయల బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి రైతులను నమ్మించారని అన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బహిరంగ మార్కెట్‌లో రైతులు కనీస మద్దతు ధర పొందే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రతి క్వింటాలు పైన మద్దతు ధరతో పోలిస్తే రైతులు 800 రూపాయలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నదని అన్నారు.

కందులకు మద్దతు ధర 7,550 ఉంది కానీ బహిరంగ మార్కెట్‌లో 6500 నుంచి 6800 మించి క్వింటాలుకు చెల్లింపు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధరపై 400 రూపాయల బోనస్ కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ప్రభుత్వం కంది రైతుల పట్ల నిర్లక్ష్యం వీడి.. వారి గోస తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు. అలాగే రైతులకు మద్దతు ధర అందేవిధంగా చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు.

Read Also: NTR : జూ. ఎన్టీఆర్ న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటున్నారో తెలుసా..?