GT vs MI IPL 2023 Qualifier 2: ఫైనల్లో గుజరాత్ టైటాన్స్… రెండో క్వాలిఫైయిర్ లో ముంబై చిత్తు

ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. రెండో క్వాలిఫైయిర్ లో ఆ జట్టు 62 పరుగుల తేడాతో ముంబైని నిలువరించింది. శుభమన్ గిల్ సెంచరీ ఈ మ్యాచ్ లో హైలెట్.

GT vs MI IPL 2023 Qualifier 2: ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. రెండో క్వాలిఫైయిర్ లో ఆ జట్టు 62 పరుగుల తేడాతో ముంబైని నిలువరించింది. శుభమన్ గిల్ సెంచరీ ఈ మ్యాచ్ లో హైలెట్.

మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఓపెనర్లు సాహా, గిల్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్ కు 54 పరుగులు జోడించారు. సాహా ఔటైనా శుబ్ మన్ గిల్ చెలరేగిపోయాడు. సాయిసుదర్శన్ తో కలిసి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కొడితే సిక్స్ లేకుంటే ఫోర్ అన్నట్టుగా సాగింది అతని బ్యాటింగ్. 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర గిల్ ఇచ్చిన క్యాచ్ ను టిమ్ డేవిడ్ వదిలేయడం ముంబై కొంపముంచింది. ఈ లైఫ్ తో మరింత దూకుడుగా ఆడిన గిల్ కేవలం 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 50 పరుగులను 17 బంతుల్లోనే కంప్లీట్ చేశాడు. సెంచరీ తర్వాత కూడా గిల్ జోరు కొనసాగింది. ఈ యువ ఓపెనర్ 60 బంతుల్లో 10 సిక్సర్లు, 7 ఫోర్లతో 129 రన్స్ చేశాడు. సాయిసుదర్శన్ 43 పరుగులు చేయగా.. చివర్లో భారీ షాట్లు కొట్టే ఉద్ధేశంతో బ్యాటింగ్ ఆర్డర్ లో పలు ప్రయోగాలు చేశారు. సాయిసుదర్శన్ ను రిటైర్డ్ ఔట్ గా వెనక్కి పిలిచి రషీద్ ఖాన్ ను పంపించారు. అటు హార్థిక్ పాండ్యా కూడా ధాటిగా ఆడడంతో గుజరాత్ 233 పరుగుల భారీస్కోర్ చేసింది. నిజానికి చివరి 3 ఓవర్లలో ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో అనుకున్నదాని కంటే 20 పరుగులు తక్కువే సాధించింది. ముంబై బౌలర్లలో బెహర్డీఫ్ తప్పిస్తే మిగిలిన వారంతా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు.

234 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆరంభం నుంచే తడబడింది. ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడడంతో ఇంపాక్ట్ ప్లేయర్ వధేరా, రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే వధేరా తొలి ఓవర్ లోనే ఔటవగా… రోహిత్ శర్మ కూడా నిరాశపరిచాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ కొనసాగించారు. గ్రీన్ చేతి గాయంతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు వెళ్ళిపోయాడు. అయితే తెలుగుతేజం తిలక్ వర్మ రెచ్చిపోయాడు. మహ్మద్ షమీ వేసిన ఓవర్లో వధేరా వరుసగా 4 ఫోర్లు, చివరి బంతికి సిక్సర్ కొట్టాడు. ధాటిగా ఆడుతున్న తిలక్ వర్మను రషీద్ ఖాన్ పెవిలియన్ కు పంపాడు. తిలక్ వర్మ కేవలం 14 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. కాగా గాయం నొప్పి భరిస్తూనే క్రీజులోకి వచ్చిన గ్రీన్ ధాటిగా ఆడాడు. గ్రీన్ 20 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత సూర్యకుమార్ హాఫ్ సెంచరీతో ఒంటరిగా పోరాడినప్పటకీ ఫలితం లేకపోయింది. దీంతో ముంబై 171 పరుగులే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 5 , షమీ 2 , రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.ఆదివారం జరిగే టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది.

Read More: IPL 2023 Qualifier 2: ముంబై కొంప ముంచిన మిస్ క్యాచ్.. లేదంటే 30 పరుగులకే గిల్ అవుట్