జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తన క్రియాశీలక సభ్యత్వ నమోదుకు మరో అవకాశాన్నిచ్చింది. ఇటీవల కొన్ని రోజుల పాటు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. అయితే అది ముగియడంతో… మళ్లీ మరొక అవకాశాన్ని ఇచ్చింది జనసేన పార్టీ. నేటి నుంచి(మార్చ్ 20) మరోసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
క్రియాశీలక సభ్యత్వ నమోదు సందర్భంగా శనివారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆదివారంతో ప్రారంభం కానున్న క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 27 వరకు కొనసాగించనున్నట్టుగా నాదెండ్ల పేర్కొన్నారు. కొత్తగా సభ్యత్వ నమోదుతో పాటు, పాత సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకునే అవకాశాన్ని పార్టీ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వారం పాటు సాగనున్న క్రియాశీలక సభ్యత్వ నమోదును 5 లక్షల మార్కును దాటేలా కృషి చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.