హైదరాబాద్: (Bonalu Festival) హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ఈ నెల 26వ తేదీ నుండి ఘనంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ పండుగకు గోల్కొండ కోటలోని ఎల్లమ్మ (జగదాంబిక) దేవాలయంలో జరిగే ప్రత్యేక పూజలతో శ్రీకారం చుడతారు.
బోనాలు సాధారణంగా జ్యేష్ఠ ఆమావాస్య అనంతరం వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారం ప్రారంభమవుతాయి. ఈసారి ఆమావాస్య జూన్ 25న రావడంతో, వచ్చే రోజు గురువారం అంటే జూన్ 26న బోనాల జాతరకు శుభారంభం అవుతుంది.
గోల్కొండ ఉత్సవాల తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్‌దర్వాజ మహంకాళి ఆలయాల్లో విశేష పూజలు జరుగుతాయి. ఆషాఢ మాసం చివరి రోజున మళ్లీ గోల్కొండ కోటలో నిర్వహించే బోనం పూజలతో ఈ ఉత్సవాలకు ముగింపు పలుకుతారు.
బోనాల ఉత్సవాలు తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. అమ్మవారికి తలంపేట బోనాలు సమర్పించడం, డప్పులు, పోతరాజుల ఊరేగింపులు, ప్రత్యేక పూజలు రాష్ట్రవ్యాప్తంగా శ్రద్ధాభక్తులతో కొనసాగనున్నాయి.