Free Bus Ride : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం..
ఈరోజు (జూన్ 11) నుంచే కర్ణాటకలో అమల్లోకి వచ్చింది..
రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సులలో ఇక మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. “శక్తి” పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ సేవను అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను అమల్లోకి తెచ్చింది. ఆదివారం (ఈరోజు) మధ్యాహ్నం 1 గంటల నుంచే కర్ణాటకలో మహిళలు ఫ్రీగా బస్సు సర్వీసులు (Free Bus Ride) వాడుకుంటున్నారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, విద్యార్థినులు ఉచితంగా ప్రయాణించే పథకాన్నికర్ణాటక విధాన సౌధ వద్దనున్న బస్టాప్ లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. శక్తి పథకం లోగోను ఆవిష్కరించి.. ఐదుగురు మహిళలకు లాంఛనంగా శక్తి స్మార్ట్‌కార్డులను అందించారు. ఈ పథకాన్ని అన్ని జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు తమ జిల్లాల్లో ప్రారంభించాలని, శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో ప్రారంభించాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు.
Also read : TSRTC: మహిళలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్!
మహిళలు ‘సేవా సింధు’ ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా శక్తి స్మార్ట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్మార్ట్ కార్డ్‌లు జారీ అయ్యే వరకు భారత ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని కార్యాలయాలు జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును చూపించి సున్నా విలువ టిక్కెట్‌ను మహిళలు పొందొచ్చు. ఈ హామీని అమలు చేయడం వల్ల ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా 41.8 లక్షల మంది మహిళా ప్రయాణికులు లబ్దిపొందుతారు. దీనివల్ల రాష్ట్ర సర్కారు ఖజానాకు సంవత్సరానికి రూ. 4,051.56 కోట్ల ఖర్చు వస్తుంది. కర్ణాటక ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లలో (KSRTC, BMTC, NWKRTC, KKRTC) 18,609 బస్సులు ఉన్నాయి. వీటన్నింటిలో మహిళలు ఫ్రీగా జర్నీ చేయొచ్చు.
Also read : Self Driving Bus : సెల్ఫ్ డ్రైవింగ్ బస్సులు వస్తున్నాయహో.. ఎప్పుడంటే ?
ఇక కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన మిగితా 4 హామీలలో.. అన్ని గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహ జ్యోతి), ప్రతి కుటుంబానికి చెందిన మహిళ పెద్దలకు రూ. 2,000 నెలవారీ సహాయం (గృహ లక్ష్మి), పేద కుటుంబంలోని ప్రతి సభ్యునికి 10 కిలోల ఉచిత బియ్యం (అన్న భాగ్య), నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌లకు ప్రతి నెల రూ. 3,000 , నిరుద్యోగ డిప్లొమా హోల్డర్‌లకు నెలకు రూ. 1,500 (యువనిధి) ఉన్నాయి.