Site icon HashtagU Telugu

Telangana : వైద్య విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి: సుప్రీంకోర్టు

Four years of locality mandatory for medical students: Supreme Court

Four years of locality mandatory for medical students: Supreme Court

Telangana : తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు నాలుగు సంవత్సరాల స్థానికత తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రభావితం చేయడంతో పాటు, వేలాది మంది స్థానిక విద్యార్థులకు న్యాయం చేసిన తీర్పుగా భావిస్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇది గొప్ప ఊరట కలిగించే అంశం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి మరియు డివిజన్ బెంచ్ ఇచ్చిన పూర్వపు ఉత్తర్వులను పక్కన పెట్టింది. దీంతో, స్థానికత నిబంధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన మద్దతు లభించింది.

Read Also: BC Reservation Bills : బీసీ రిజర్వేషన్ల బిల్లులకు తెలంగాణ శాసనమండలి ఆమోదం..నిరవధిక వాయిదా

సుప్రీంకోర్టు పేర్కొన్న ప్రకారం, మెడికల్ సీట్లు చాలా ఖరీదైనవని, ఇవి పరిమిత సంఖ్యలో ఉన్నందున వాటి పంపిణీలో సామాన్యుల ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు అవసరమని అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న “9వ తరగతి నుండి 12వ తరగతి వరకు రాష్ట్రంలోని పాఠశాలలో చదివి ఉండాలి” అనే నిబంధనను ధర్మాసనం సమర్థించింది. ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు మాట్లాడుతూ..సంపన్న విద్యార్థులు విదేశాల్లో, ముఖ్యంగా లండన్, దుబాయ్ వంటి ప్రదేశాల్లో 11వ, 12వ తరగతులు చదివి, తిరిగి రాష్ట్రానికి వచ్చి మెడికల్ సీట్లను సులభంగా పొందుతున్నారని చెప్పారు. ఇది తెలంగాణలో చదువుతున్న సామాన్య విద్యార్థులపై అన్యాయం అవుతోందని వివరించారు. అంతేకాదు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) ప్రకారం, ఒక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు సమాన విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రాలు వేర్వేరు నిబంధనలు రూపొందించుకోవచ్చని సుప్రీంకోర్టు గుర్తుచేసింది.

ఇకపోతే, ఇతర రాష్ట్రాల ప్రస్తావన కూడా కోర్టులో జరిగింది. హరియాణాలో 10వ తరగతి నుండి 12వ తరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివిన విద్యార్థులకే మెడికల్ సీట్లకు అర్హత ఉంది. అలాగే, అసోం రాష్ట్రం లో 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు స్థానికంగా చదవడం తప్పనిసరి. ఈ సందర్భాల్లో తీసుకున్న తీర్పులు తెలంగాణ కేసులో కోర్టు దృష్టికి తీసుకురాబడ్డాయి. అంతేకాక, ఆంధ్రప్రదేశ్‌లోనూ స్థానికత నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారని వెల్లడించారు. ఒక తెలంగాణ విద్యార్థికైనా ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ సీటు దక్కే అవకాశమే లేదు అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ తీర్పుతో పాటు, సివిల్ సర్వీసెస్ తదితర ఉద్యోగాల్లో భాగంగా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల వారి పిల్లలు అక్కడ చదివినట్లయితే వారికి మినహాయింపులు కల్పిస్తున్న విషయాన్ని కూడా కోర్టుకు తెలియజేశారు. సుప్రీంకోర్టు ఈ తీర్పుతో లక్షలాది మంది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, స్థానికత నిబంధనను సమర్థించడంలో న్యాయబద్ధత ఉందని స్పష్టం చేసింది. పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులు అధిక ఖర్చులు లేకుండా తమ రాష్ట్రంలోనే వైద్య విద్య పొందే అవకాశాన్ని ఈ నిబంధన కల్పిస్తుందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు, తెలంగాణ విద్యా రంగానికే కాకుండా, దేశ వ్యాప్తంగా రాష్ట్ర స్థాయి విద్యా విధానాలపై ప్రభావం చూపే విధంగా ఉండనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read Also: KTR : ఇప్పుడు మీ సీఎం ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా.?