Site icon HashtagU Telugu

Maharashtra : మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ కారుపై రాళ్లదాడి..తలకు గాయాలు

Ex-Maharashtra minister Anil Deshmukh injured after stone pelting on car

Ex-Maharashtra minister Anil Deshmukh injured after stone pelting on car

Former minister Anil Deshmukh : ఎన్సీపీ (ఎస్పీ) నేత, మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వాహనంపై మంగళవారం ఉదయం నాగ్‌పుర్‌ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. అయితే ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నార్ఖేడ్‌లో నిర్వహించిన ఓ సమావేశానికి అనిల్‌ దేశ్‌ముఖ్‌ హాజరయ్యారు.  అనంతరం కటోల్‌కు తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో జలాల్‌ఖేడా రోడ్‌లోని బెల్‌ఫాటా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు విసిరారు.

ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే కటోల్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు నాగ్‌పుర్‌ రూరల్‌ ఎస్పీ హర్ష్‌ పొద్దర్‌ వెల్లడించారు. దాడిలో కారు కూడా కొంతమేర ధ్వంసమైందన్నారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ గతంలో మహారాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు. రూ.కోట్లలో లంచం డిమాండ్‌ చేశారనే ఆరోపణలు రావడంతో మంత్రివర్గం నుంచి వైదొలిగారు. ఆయన కుమారుడు సలీల్‌ దేశ్‌ముఖ్‌ ప్రస్తుతం కటోల్‌ నియోజకవర్గం నుంచి ఎన్‌సీపీ (ఎస్పీ) తరఫున పోటీ చేస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై అనిల్‌ దేశ్‌ముఖ్‌ మద్దతుదారులు కటోల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులపై త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ “ప్రమాదకరమైన దాడి”ని కాంగ్రెస్‌ నేత బాలాసాహెబ్‌ థోరట్‌ ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, పారదర్శకంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొన్న మహారాష్ట్రలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 288 స్థానాలు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌ 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Read Also: KTR Target : కేటీఆర్ టార్గెట్ రేవంతేనా..?