China: చైనాలో వింత ఘటన.. ఏకంగా కనురెప్పల్లో గుడ్లు పెట్టిన పేను?

మామూలుగా మనం పేను అనేది తలలో గుడ్లు పెట్టడం చూసి ఉంటాం. ఈ పేను ను ఒక్కో ప్రదేశంలో ఒక్కో రంగా పిలుస్తూ ఉంటారు. ఇప్పటివరకు మీరు తలలో పేను

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 05:00 PM IST

మామూలుగా మనం పేను అనేది తలలో గుడ్లు పెట్టడం చూసి ఉంటాం. ఈ పేను ను ఒక్కో ప్రదేశంలో ఒక్కో రంగా పిలుస్తూ ఉంటారు. ఇప్పటివరకు మీరు తలలో పేను గుడ్డు పెట్టడం చూసి ఉంటారు. లేదా విని ఉంటారు. కానీ చైనాలో మాత్రం ఒక వింత ఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే చైనాలో బాలుడికి పేను ఏకంగా కంటిలో వందలాదిగా గుడ్లను పెట్టి, గూడును ఏర్పరుచుకుంది. 3 ఏళ్ల బాలుడు కనురెప్పల్లో పేను గూడు కట్టుకున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇలాంటి ఘటనను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.

కంటి చుట్టూ తీవ్రమైన దురద, కంటి నుంచి నీరు కారడం, వారం కన్నా ఎక్కువ రోజులు కన్ను వాచి ఉండటంతో వైద్యున్ని సంప్రదించారు. బాలుడిని కంటి వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తలలోని పేను బాలుడి కనురెప్పల కింద ఏకంగా గూడును ఏర్పాటు చేసుకుని, గుడ్లను పెట్టినట్లు వైద్యులు గుర్తించారు. దీనిని అత్యంత అరుదైన కేసుగా అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ కేస్ రిపోర్ట్స్ గా వెల్లడించారు. కాగా కనురెప్పల్లో ఉండే వెంట్రుకల్లో పరాన్న జీవులు పాకుతున్నట్లుగా గమనించిన వైద్యులు, మైక్రోస్కోప్ తో మరింతగా పరీక్షించగా తలలో ఉండే పేనుగా గుర్తించారు.

జెంగ్‌జౌకి చెందిన పసిపిల్లవాడు ఇసుకలో ఆడటం, తరుచుగా మురికి చేతులతో కళ్లను రద్దుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు గుర్తించారు. అదృష్టకరమైన విషయం ఏంటంటే వీటి వల్ల పిల్లాడి చూపు ప్రభావితం కాలేదు. పేను ని కంటి నుంచి తొలగించిన తర్వాత పిల్లాడి పరిస్థితి క్రమంగా మెరుగైంది. అయోడిన్ మందుతో తడిపిన కాటన్ తో కంటిలోని పేల గూడును తొలగించారు. చికిత్స కోసం 0.5% ఎరిత్రోమైసిన్ ఆప్తాల్మిక్ కంటి మందును కంటికి అప్లై చేయడంతో పాటు 0.3% టోబ్రామైసిన్ కంటి చుక్కలతో కంటిని శుభ్రం చేసినట్లు వైద్యులు వెల్లడించారు.