కర్ణాటక రాజకీయాల్లో షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక ఈ రోజు సాయంత్రం 6గంటలకు రాష్ట్ర కర్ణాటక 34వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డీకే శివకుమార్, పదవీ విరమణ చేస్తున్న ముఖ్యమంత్రి సిద్ధారామయ్య నుంచి అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. లోక్‌భవన్‌లో జరగనున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొననున్నారు. డీకే శివకుమార్‌తో పాటు తొలి దశలో 10 నుంచి 15 మంది వరకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేబినెట్ జాబితాను కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉంది. సిద్దరామయ్య మంత్రివర్గంలో పనిచేసిన కొందరికి కొనసాగింపు లభించే అవకాశం ఉండగా, కొత్త ముఖాలకు కూడా చోటు కల్పించనున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల అనంతరం కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్ తదితరులు హాజరుకానున్నారు. అలాగే పలువురు రైతు నాయకులు, దళిత ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, మతపెద్దలు, కన్నడ ఉద్యమకారులను కూడా ఆహ్వానించారు.
డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో బెంగళూరు నగరంలో ఆయన అనుచరులు భారీ ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆయన స్వస్థలమైన కనకపురలో సంబరాలు అంబరాన్నంటనున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం కారణంగా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా పదవీ విరమణ చేస్తున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ‘ఎ’ కేటగిరీ సభ్యుడిగా నియమించింది. డీకే శివకుమార్‌కు అధికార బదిలీ సజావుగా జరిగేలా సహకరించినందుకు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.
