ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి సీజన్‌లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. ఐపీఎల్-2022లో ఇప్పటి వరకు విజయం సాధించని ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూసి పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ఇక తన తర్వాతి మ్యాచ్ ను గురువారం చెన్నై సూపర్ కింగ్స్ తో రోహిత్ సేన పోటీపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. అయితే ప్రస్తుతం వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ గెలుపుబాట పట్టేందుకు తుది జట్టులో పలు మార్పులు చేయాలని భావిస్తోంది.
ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ సూచనా మేరకు ముంబైకి చెందిన ధవల్ కులకర్ణిని జట్టులోకి తీసుకునేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలో జరుగుతుండటంతో ఇక్కడి పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్న కులకర్ణిని ఎలాగైనా జట్టులో చేర్చుకోవాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన ధవల్ కులకర్ణిని జట్టులోకి తీసుకుంటున్నట్లు సమాచారం.. అలాగే ధవల్ కులకర్ణి టీమిండియా తరఫున 12 వన్డేలు, 2 టీ20లు ఆడి 22 వికెట్లు తీశాడు. ఇక ధవల్ కులకర్ణి ఐపీఎల్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు తీశాడు. అలాగే ఈ మెగాటోర్నీలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.