PBKS vs DC: పంజాబ్ అవకాశాలను దెబ్బతీసిన ఢిల్లీ… ప్లే ఆఫ్ రేస్ నుంచి ఔట్

PBKS vs DC: ఐపీఎల్ 16వ సీజన్ లో మరో టీమ్ కథ ముగిసింది. ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ పంజాబ్ కింగ్స్ ఇంటిదారి పట్టింది. ఇప్పటికే లీగ్ నుంచి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్ వెళుతూ వెళుతూ పంజాబ్ కింగ్స్ ను కూడా తీసుకెళ్ళిపోతోంది. కీలక మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 15 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే పంజాబ్ (PBKS) ప్లే ఆఫ్ అవకాశాలు నిలిచి ఉండేవి.

మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) దూకుడుగా ఆడింది. గత కొన్ని మ్యాచ్ లుగా విఫలమవుతున్న కెప్టెన్ డేవిడ్ వార్నర్, పృథ్వి షాతో కలిసి అదరగొట్టాడు. వీరిద్దరూ భారీ షాట్లతో పంజాబ్ బౌలర్లపై ఆధిపత్యం కనబరిచారు. తొలి వికెట్ కు కేవలం 10.2 ఓవర్లలోనే 94 పరుగులు జోడించారు. వార్నర్ 46 పరుగులకు ఔటైనా..పృథ్వీ షా దూకుడు కొనసాగింది. షా 54 పరుగులకు ఔటవడంతో ఢిల్లీ రెండో వికెట్ కోల్పోయింది. అయితే వన్ డౌన్ బ్యాటర్ రొసో మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. భారీ సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సాల్ట్ తో కలిసి కేవలం ఐదు ఓవర్లలో 75 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. రొసో కేవలం 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 82 పరుగులతో నాటౌట్ గా నిలిస్తే..సాల్ట్ 14 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 రన్స్ చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 213 పరుగుల భారీస్కోర్ నమోదు చేసింది. పంజాబ్ బౌలర్లలో శామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టగా.. మిగిలిన వారంతా భారీగా పరుగులు ఇచ్చేశారు.

ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ పేలవంగా ఇన్నింగ్స్ ఆరంభించింది. తొలి ఓవర్ ను ఖలీల్ అహ్మద్ మెయిడెన్ చేయగా.. ధావన్ డకౌటయ్యాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ప్రభ్ సిమ్రన్ సింగ్ మరోసారి ధాటిగా ఆడాడు. ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయినప్పటకీ 19 బంతుల్లో 4 ఫోర్లతో 22 రన్స్ చేసాడు. ఆ తర్వాత లివింగ్ స్టోన్, అధర్వ పంజాబ్ ఇన్నింగ్స్ కొనసాగించారు. క్రీజులో కుదురుకున్న వీరిద్దరూ ధాటిగా ఆడారు. మంచు ప్రభావం ఎక్కువగానే ఉండడంతో ఢిల్లీ బౌలర్లకు బంతిపై పట్టు చిక్కలేదు. దీనికి తోడు పలు క్యాచ్ లు కూడా వదిలేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. విజయం కోసం 5 ఓవర్లలో 86 పరుగులు చేయాల్సి ఉండగా.. అధర్వ రిటైర్డ్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. ఈ యువ బ్యాటర్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ డకౌటవగా.. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. లివింగ్ స్టోన్ చివరి బంతి వరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. మరో ఎండ్ నుంచీ సపోర్ట్ ఉండి ఉంటే పంజాబ్ టార్గెట్ అందుకునేది. లివింగ్ స్టోన్ 48 బంతుల్లో 5 ఫోర్లు , 9 సిక్సర్లతో 94 రన్స్ చేసి చివరి బంతికి ఔటయ్యాడు. చివరికి పంజాబ్ కింగ్స్ 198 పరుగులే చేయగలిగింది. ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలకు తెరపడింది. మరోవైపు వరుస ఓటములకు బ్రేక్ వేసిన ఢిల్లీ సీజన్ లో ఐదో విజయాన్ని అందుకుంది.

Read More: PKBS vs DC: వార్నర్ రికార్డ్: పంజాబ్ పై అత్యధిక పరుగులు