Daggubati Purandeswari : రాజమండ్రి ఎంపీ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి డా. బీఆర్ అంబేద్కర్‌ను అత్యంత గౌరవించిన పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పుడూ అగౌరవపరచలేదని, కాంగ్రెస్ రాజ్యాంగం మారుస్తుందని బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఇవాళ పురందరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ “డా. అంబేద్కర్‌ను భారతరత్న పురస్కారం ఇచ్చిన ఘనత బీజేపీదే. వాజ్‌పేయీ హయాంలో ఆయనకు ఈ గౌరవం దక్కింది. కానీ, అంబేద్కర్‌ను తమ నాయకుడిగా పేర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆయనకు భారతరత్న ఇవ్వలేకపోయింది?” అని ప్రశ్నించారు.
పురందరేశ్వరి మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ చరిత్రపరంగా అంబేద్కర్‌ను ద్వేషించింది. రెండు సార్లు ఆయనను అమానించింది. ఒకవైపు ఎన్నికల్లో గెలవనివ్వకపోవడం, మరోవైపు మానసికంగా కుంగిపోవడానికి కారణమైన చర్యలు కాంగ్రెస్ తీసుకుంది. ఇప్పుడు మాత్రం అంబేద్కర్‌పై ప్రేమను చూపుతూ ప్రజలను మభ్యపెడుతోంది” అని ఆరోపించారు. “బీజేపీ రాజ్యాంగాన్ని ఎత్తివేస్తుందని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కానీ బీజేపీ ఎప్పుడూ రాజ్యాంగాన్ని స్వలాభం కోసం మార్చలేదు. మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణలు చేయడం మాత్రమే జరిగింది. కానీ, కాంగ్రెస్ గతంలో రాజ్యాంగాన్ని ఉపయోగించి అనేక మార్పులు చేసింది,” అని అన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, “రాహుల్ గాంధీ అంబేద్కర్ చిత్రపటానికి మాల కూడా వేయలేదు. ఇది అంబేద్కర్‌పై వారి గౌరవాన్ని చూపిస్తోంది” అని పురందరేశ్వరి వ్యాఖ్యానించారు. పురందరేశ్వరి, బీజేపీ హయాంలో హిందూ బిల్, యూనిఫారం సివిల్ కోడ్ బిల్లు వంటి సంస్కరణలు తెచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. “బీజేపీ ఎన్నడూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు, దాన్ని మార్చాలన్న ఆలోచన కూడా లేదు,” అని స్పష్టంగా తెలిపారు.
జమీలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన అంశాన్ని పురందరేశ్వరి గుర్తు చేశారు. “అప్రజాస్వామికమైన ఆర్టికల్ 356ను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వాల రద్దుకు ఉపయోగించే ఈ చట్టం ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఉంది,” అని పేర్కొన్నారు. ఆందోళనలకు దారితీసిన కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ వివరణ ఇచ్చారు. “అంబేద్కర్‌ను గౌరవించే విషయంలో బీజేపీ పదేపదే చరిత్ర సృష్టించింది,” అని ఆమె హైలైట్ చేశారు.
Ismail Haniyeh : ఔను.. ఇస్మాయిల్ హనియాను మేమే హత్య చేశాం : ఇజ్రాయెల్