Site icon HashtagU Telugu

Telangana: యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలు ఏర్పాటు

Telangana

Telangana

Telangana: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం కాంగ్రెస్ సర్కారు సన్నద్ధమైంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి కొనుగోళ్ల కేంద్రాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 7,149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రారంభమౌతాయని ఆమె చెప్పారు. ఇప్పటికే ప్రారంభమైన పలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ముమ్మరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రైవేట్ వ్యాపారులు కాంటాలు తెరిచి, మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు

అంతకుముందు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి సరఫరా, మన ఊరు – మనబడి పనులపై కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు నెలల పాటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదౌతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వడదెబ్బ, డిహైడ్రేషన్ పై ప్రజలను చైతన్యపరచాలని కలెక్టర్లకు సూచించారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐ.వీ ఫ్లూయిడ్లు, మందులను పంపించామని వాటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఆశా కార్యకర్తలు ఉపాధి హామీ పనుల కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో పెట్టాలన్నారు.

We’re now on WhatsAppClick to Join

తాగునీటి సరఫరాను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆమె అన్నారు. అందుకోసం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో తాగునీరు సరఫరా పర్యవేక్షణ బాధ్యత స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ బావుల నుంచి అద్దె ప్రాతిపదికపై నీటిని సరఫరా చేయాలని లేదా ట్యాంకర్ల ద్వారా పంపించాలని శాంతికుమారి సూచించారు.

Also Read: Kejriwal : డాన్, గ్యాంగ్ స్టర్, టెర్రరిస్ట్.. కేజ్రీవాల్ సెల్ పక్కనే వీరంతా !!