Site icon HashtagU Telugu

Corona: మరోసారి చైనాలో కరోనా విలయతాండవం.. వారంలో 13వేల మంది మృతి!

220123chinacdc

220123chinacdc

Corona: కరోనాకు పుట్టినిల్లుగా ప్రపంచం భావిస్తున్న చైనాలో మరోసారి కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య చైనాలో అంతకంతకు పెరుగుతుండగా.. భారీగా మరణాలు పెరుగుతుండటం అందరికీ కలవరం కలిగిస్తోంది. కేవలం ఒక్క వారంలోనే చైనా దేశం మొత్తంలో ఆస్పత్రుల్లో మరణించిన వారి సంఖ్య ఏకంగా 13వేలుగా ఉండటం ప్రపంచానికి కలవరం రేపుతోంది. మరోసారి కరోనా వేవ్ రాబోతోందా అనే ఆందోళనకు గురి చేస్తోంది.

చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండగా.. అక్కడ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. అయితే నియంత్రిత విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. వేలాదిగా జనాలు రోడ్లకు మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. అయితే ఇప్పుడు ఇదే వారికి ముప్పుగా మారింది. చైనాలో ఊహించిన స్థాయి కన్నా వేగంగా కరోనా వ్యాపిస్తోంది.

గత వారం రోజుల్లో మరణించిన వారిలో 681 మంది శ్వాస వ్యవస్థ విఫలం కావడం వల్ల మరణించారని, 11977 మంది కోవిడ్ తో పాటు ఇతర వ్యాధుల వల్ల మరణించినట్లు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. జీరో కోవిడ్ ఎత్తివేసిన నెల రోజుల్లోనే 60వేల కోవిడ్ మరణాలు సంభవించడం ప్రభుత్వానికి ఇబ్బంది కరంగానూ, ఇతర దేశాలకు ఆందోళన కరంగా మారాయి.

కాగా చైనా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం సెలవులు ఇవ్వగా.. ఈ సెలవుల్లో ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఈ ప్రయాణాల వల్ల ఈ రిస్క్ మరింత పెరుగుతుందని, రోజుకు రోజుకు 30వేల మరణాలు సంభవించవచ్చని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి చైనాలో సంభవిస్తున్న కరోనా మరణాల లెక్కలు ప్రపంచ దేశాలకు భయాన్ని కలిగిస్తున్నాయి.