హైదరాబాద్ (Hyderabad) తరహాలో వరంగల్(Warangal)ను మహానగరంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. వరంగల్‌లో విమానాశ్రయ అభివృద్ధి పై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, మామూనూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ, ప్రణాళికలను పరిశీలించారు. ఈ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.
దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు పెట్టుబడులకు విమానాశ్రయాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటున్న దృష్ట్యా, వరంగల్ ఎయిర్‌పోర్టును ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రముఖంగా ఉండే కొచ్చి ఎయిర్‌పోర్టును పరిశీలించి, ఆ మోడల్‌ను అనుసరించాలని సూచించారు. అలాగే ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా వరంగల్ ఔటర్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
Game Changer Talk : గేమ్ ఛేంజర్ పబ్లిక్ టాక్
వరంగల్ ఎయిర్‌పోర్టు నుంచి ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల ప్రజలు ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉండే రీతిలో రహదారులను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. టెక్స్‌టైల్స్, ఐటీ, ఫార్మా తదితర పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని, వరంగల్‌ను హైదరాబాద్‌ను ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. మేడారం జాతర, రామప్ప, లక్షణవరం వంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చే సందర్శకులు విమానాశ్రయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందన్నారు. పర్యాటకంగా వరంగల్ ప్రాముఖ్యత పెరుగుతున్న దృష్ట్యా, విమానాశ్రయం పూర్తి అవడంతో పర్యాటక వృద్ధికి మరింత ఊతమిస్తుందని సీఎం తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.