CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 29న ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ పెద్దలు, పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీడబ్ల్యుసీ సమావేశానికి హాజరు కానున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
కాగా, ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను ఢిల్లీలో కలిసిన విషయం తెలిసిందే. వయనాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు ప్రియాంక గాంధీకి అభినందనలు తెలిపారు. ఇక, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న తెలంగాణ అంశాలపై పార్లమెంటులో ప్రశ్నించాలని వారికి సూచించారు. ఇక గతసోమవారం రాత్రి స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహ వేడుకకు సీఎం రేవంత్ హాజరైన విషయం తెలిసిందే.