CM Revanth Reddy : వేములవాడలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శులు గుప్పించారు. ప్రభుత్వంలో ఉంటూ కుట్రలు చేశారంటూ కేటీఆర్‌పై రేవంత్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సక్రమంగా పరిహారం ఇవ్వలేదన్నారు. కుట్రలు చేసిన కేటీఆర్ ఊచలు లెక్కపెడతారంటూ హెచ్చరించారు. కేటీఆర్ చేసిన కుట్రలను గమనిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. ఎంత ఎగురుతావో ఎగురంటూ చురకలంటించారు. కేటీఆర్ తన వైఖరి మార్చుకోవాలని రేవంత్ పరోక్షంగా సూచించారు.
కేసీఆర్ పదేళ్లలో చేయలేని పనులను తాము చేస్తున్నామని, అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నేతలకు మైండ్ పోయిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ గడిచిన పదేళ్లు సరిగ్గా పని చేసి ఉంటే రుణమాఫీ చేయాల్సి వచ్చేదా? అని, కేసీఆర్ వల్ల రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానం లో ఉందని చెప్పారు. ఇక 11 వెల కోట్ల రుణమాఫీకి ఐదేళ్లు తీసుకున్నారని, తాము 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు 18 వేల కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలా భూములు తీసుకుని పరిహారం ఇవ్వకుండా తప్పించుకోమన్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించే భూమికిరైతులకు రెండు రెట్ల పరిహారం ఇస్తామన్నారు. పరిశ్రమలు రావాలంటే భూసేకరణ చేయాల్సిందేనన్నారు. తెలంగాణకు పరిశ్రమలు వద్దని బీఆర్‌ఎస్ కోరుకుంటుందా అని సీఎం ప్రశ్నించారు. భూమి మార్కెట్ ధర రూ.10 లక్షలు ఉంటే రూ.30 లక్షల పరిహారం ఇస్తామన్నారు. నష్ట పరిహారం ఎక్కువ ఇస్తే భూయజమానులు తమ భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తారన్నారు.