ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu ) వడ్లమాను(Vadlamanu ) సభలో ప్రసంగిస్తూ తనపై జరిగిన మోసాన్ని ఆవేదనతో వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) మరణాన్ని మొదట గుండెపోటుగా ప్రకటించారని, కానీ అది గొడ్డలివేటుతో జరిగిన హత్య అని తర్వాత తెలిసిందన్నారు. “ఒక సీఎం అయిన నన్నే మోసం చేయగలిగితే, మీరు ఊహించండి మిగతావారికి ఏం జరుగుతుందో” అని ప్రజలను చైతన్యపరిచేలా వ్యాఖ్యానించారు. నేటి రోజుల్లో హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించగలిగే పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దుష్టశక్తులకు సరైన సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
రైతులకు రూ.20,000, తల్లులకు వందనం పథకం
రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని చెబుతూ.. చంద్రబాబు పలు కీలక సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. తల్లికి వందనం పథకం కింద అర్హులైన తల్లులకు రూ.15,000 అందజేస్తామని తెలిపారు. అలాగే మే నెల నుండి రైతులకు రూ.20,000 (ఇందులో కేంద్రం ఇస్తున్న రూ.6,000తో కలిపి) మద్దతుగా ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యాచరణ చేపడతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.
త్వరలో బీసీ సంరక్షణ చట్టం
బీసీల సంక్షేమానికి టీడీపీ మొదటి నుంచి కృషి చేస్తోందని గుర్తు చేసిన సీఎం చంద్రబాబు, త్వరలో రాష్ట్రంలో బీసీ సంరక్షణ చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఉద్యోగాల్లో 33% మరియు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లను కల్పించామని వివరించారు. అమరావతిలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే కులవృత్తుల వారితో మాట్లాడిన చంద్రబాబు, వారికి పనిముట్లు, ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పుకొచ్చారు.
Ranas Interrogation: తహవ్వుర్ రాణా విచారణ షురూ.. ఎన్ఐఏ అడిగిన ప్రశ్నలివీ