CM Chandrababu : ఢిల్లీలో బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ, బీజేపీని గెలిపించాలని తెలుగు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ, పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేకపోయిందని విమర్శించారు.
ఢిల్లీ మురికి కూపంగా మారిందా?
చంద్రబాబు ఢిల్లీలోని కాలుష్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దేశం స్వచ్ఛ భారత్ వైపు దూసుకుపోతుంటే, ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారుతోంది. ఇక్కడ వాతావరణ కాలుష్యం మాత్రమే కాదు, పొలిటికల్ పొల్యూషన్ కూడా ఉంది. సరైన నీటి పైపులైన్లు లేక తాగునీరు కలుషితమవుతోంది. ఒకప్పుడు బీహార్ నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చేవారు, ఇప్పుడు దక్షిణ భారతదేశం వెళ్తున్నారు. అభివృద్ధి కలిగిన ప్రాంతాల వైపు వలసలు ఉంటాయి, కానీ ఢిల్లీ పరిస్థితి అందుకు విరుద్ధంగా మారింది’’ అని ఆయన విమర్శించారు.
Nagababu : పెద్దిరెడ్డి బాగోతాలు బయటపెట్టిన మెగా బ్రదర్
తెలుగువారి మద్దతు అవసరం
ఢిల్లీలో తెలుగు ఓటర్లను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ఢిల్లీలో ఇంతమంది తెలుగువారు ఉన్నారని అనుకోలేదు. ప్రతి తెలుగు ఓటరు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలి. మన తెలుగువారి ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇటీవల దావోస్‌లో పెట్టుబడుల కోసం వెళ్లినప్పుడు 650 మంది తెలుగువారు అక్కడ ఉన్నారు. 1995లో ఐటీ గురించి మాట్లాడిన నేను, ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి మాట్లాడుతున్నాను’’ అని అన్నారు.
బీజేపీ గెలిస్తేనే సంక్షేమ ఫలాలు
బీజేపీ గెలిస్తే దేశ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు వివరించారు. ‘‘ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, హోలీ, దీపావళి పండుగకు ఉచితంగా గ్యాస్ సిలిండర్, రూ.500కు సిలిండర్, పేదల వైద్యం కోసం రూ.5 లక్షలు, వృద్ధాప్య పింఛన్లుగా రూ.2,500, వితంతువులకు, దివ్యాంగులకు రూ.3,000 అందిస్తారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం ఉచితంగా అందుతుంది’’ అని వివరించారు.
ప్యాలెస్‌లు కట్టుకునే పాలకులు వద్దు
ఆప్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన చంద్రబాబు, ‘‘ఆప్ ప్రభుత్వం ప్రజలకు మంచినీరు కూడా అందించలేకపోయింది. ప్రధాని మోదీ అమృత్ కింద ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందించేందుకు కృషి చేస్తున్నారు. కానీ కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా వినియోగించలేకపోయారు. ఢిల్లీ అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. మురికిగా మారిన యమునా నదిని శుద్ధి చేయడం మోదీకే సాధ్యం’’ అని అన్నారు.
ఏపీలో ప్రత్యర్థి పార్టీ డిపాజిట్లు కోల్పోయింది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తే ప్రత్యర్థి పార్టీ గల్లంతైంది. డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయింది. మా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఏపీకి రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. దేశ అభివృద్ధి కోసం బీజేపీ, టీడీపీ కలిసి పనిచేయాలి’’ అని తెలిపారు.
కేజ్రీవాల్ పాలనకు ముగింపు పెట్టాలి
ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన చంద్రబాబు, ‘‘ఏపీలో రుషికొండ ప్యాలెస్ కట్టారు. దాని లోపలికి వెళ్లేలోపే జగన్ ఇంటికి వెళ్లిపోయాడు. ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ శేషమహల్ కట్టించారు. ఆ ప్యాలెస్‌లోకి ప్రవేశించడానికి ముందే, ప్రజలు ఆయన్ని ఓడించాలి’’ అని అన్నారు.
బీజేపీ విజయం తప్పనిసరి
చివరిగా చంద్రబాబు తెలుగువారిని ఉద్దేశిస్తూ, ‘‘దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీ గెలవాలి. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 2047 నాటికి నెంబర్ వన్ దేశంగా అవతరిస్తుంది. తెలుగువారు ఎక్కడ ఉన్నా ఐక్యంగా ఉండాలి. మీకు అండగా, తోడుగా నేనుంటా’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.