Site icon HashtagU Telugu

Chaganti Koteswara Rao: సీఎం చంద్రబాబుతో చాగంటి కోటేశ్వరరావు భేటి

Chaganti Koteswara Rao meet with CM Chandrababu

Chaganti Koteswara Rao meet with CM Chandrababu

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు భేటి అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు చాగంటికి సూచించారు. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని సీఎం అన్నారు.

అంతేకాక..మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్​తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని ఆ దిశగా అందరూ కృషి చేయాలని అన్నారు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మన సొంతం అని, వాటిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలని చంద్రబాబు అన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లితండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయని అన్నారు.

మరోవైపు చాగంటి కోటేశ్వరరావు ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని నివాసంలో లోకేశ్​తో సమావేశం అయ్యారు. విద్యార్థుల్లో మహిళలు, పెద్దలు, గురువులపై గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని దీని కోసం అమూల్యమైన సలహాలు అవసరమని చాగంటికి లోకేశ్​ చెప్పారు. అయితే విద్యార్థుల్లో సత్ప్రవర్తన పెంపొందించేందుకు తన వంతు సలహాలు, సహకారం అందిస్తానని ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు చెప్పారు. కాగా, చాగంటి కోటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైతిక విలువల సలహాదారుగా ఇటీవల నియమించిన విషయం తెలిసిందే.

Read Also: YS Sharmila : సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ..జగన్ చేసుకున్న ఒప్పందాలను రద్దు చెయ్యండి