Kasireddy Narayan Reddy : అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో కలిసి జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి కసిరెడ్డి నారాయణ రెడ్డి వెళ్లారు. ఈ భేటీ అనంతరం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కసిరెడ్డి ప్రకటించారు. సోనియాగాంధీ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
ఆరు గ్యారెంటీలతో పేదలకు న్యాయం
‘‘ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్న సంకల్పంతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందో.. తొమ్మిదేళ్లు గడిచినా ఆ లక్ష్యం నెరవేరలేదు. ఈ క్రమంలోనే సోనియాగాంధీ ఇటీవల తుక్కుగూడ సభలో ఆరు గ్యారెంటీలు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందన్న నమ్మకం నాకు కలిగింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పేదలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను’’ అని కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్పారు. ఇన్నాళ్లపాటు బీఆర్ఎస్ పార్టీలో తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని భావించారు. అయితే సీఎం కేసీఆర్ కల్వకుర్తి నియోజకవర్గం టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కే కేటాయించారు. దీంతో నిరాశచెందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ లో చేరి, కల్వకుర్తి టికెట్ పొందాలని యోచిస్తున్నారు.
Also read : Cross-Sea Bullet Train: చైనాలో తొలి క్రాస్ సీ బుల్లెట్ ట్రైన్, గంటకు 350 కిలోమీటర్లు
వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల టైంలోనే కల్వకుర్తి నుంచి పోటీ చేయాలని నారాయణ రెడ్డి భావించగా, బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకు సర్దిచెప్పింది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నారాయణ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. ఇప్పుడు కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. టికెట్ కన్ఫార్మ్ కావడం వల్లే నారాయణ రెడ్డి రేవంత్ తో భేటీ అయ్యారని, త్వరలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో (Kasireddy Narayan Reddy) చర్చ జరుగుతోంది.