BCCI: ప్రైజ్మనీ భారీగా పెంచిన బీసీసీఐ

ఆటగాళ్ల ప్రైజ్ మనీ విషయంలో బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవాలీ టోర్నీల్లో విజేతలతో పాటు, ఓడిన ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికాలను భారీగా పెంచింది

BCCI: ఆటగాళ్ల ప్రైజ్ మనీ విషయంలో బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవాలీ టోర్నీల్లో విజేతలతో పాటు, ఓడిన ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికాలను భారీగా పెంచింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్‌ ద్వారా అధికారికంగా వెల్లడించారు.

ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఒక రకంగా మనీ పవర్‌ ఏంటో క్రికెట్‌ దేశాలకు రుచి చూపించిన ఘనత బీసీసీఐదే. ఇక ఐపీఎల్ టోర్నీ పరిచయం చేసి ప్రపంచ దేశాల క్రికెట్ బోర్డులకు బీసీసీఐ పెద్దన్న పాత్ర పోషించింది. ఈ మెగా టోర్నీ ద్వారా బీసీసీఐ కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. వేలంలో ఆటగాళ్ల ప్రతిభకు తగ్గ పారితోషికాలు ఇస్తూనే మరోవైపు ప్రసారాల ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటుంది. అయితే తాజాగా ఆటగాళ్ల ప్రైజ్ మనీ విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యపరుస్తుంది.

బీసీసీఐ పెంచిన ప్రైజ్ మనీ వివరాలు ఇలా ఉన్నాయి:

* రంజీ ట్రోఫీ విజేతకు రూ.5 కోట్లు.
* ఫైనల్లో ఓడిపోయిన జట్టుకు రూ.3 కోట్లు.
* రంజీ ట్రోఫీ సెమీస్ లో ఓడిన జట్టుకు రూ. 1 కోటి. గతంలో రూ.50 లక్షలుగా ఇచ్చేవారు. ప్రస్తుతం కోటికి పెంచారు. .
* అదేవిధంగా దులీప్ ట్రోఫీ విజేతకు రూ.1 కోటి.
* రన్నరప్ కు రూ.50 లక్షలు. గతంలో అంటే నిన్నటివరకు దులీప్ ట్రోఫీ విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలు ఇచ్చేవారు.
* విజయ్ హజారే ట్రోఫీలో విజేతకు 30 లక్షలు ఇస్తుండగా, ఇప్పుడు దాన్ని 1 కోటికి పెంచారు.
* రన్నరప్ కు అందించే 15 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచారు.
* దేవధర్ ట్రోఫీలో ఇప్పటివరకు విజేతకు రూ.25 లక్షలు, రన్నరప్ కు రూ.15 లక్షలు ఇస్తుండగా… ఇకపై విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలు చెల్లిస్తారు.
* ప్రైజ్ మనీ పెంచిన తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేతలకు రూ.80 లక్షలు, ఫైనల్లో ఓడిన జట్టుకు రూ.40 లక్షలు అందించనున్నారు. ఇప్పటివరకు ఫైనల్ విజేతకు రూ.25 లక్షలు, రన్నరప్ కు రూ.10 లక్షలుగా ఉండేది.
* ఇక సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ విజేతకు రూ.50 లక్షలు, రన్నరప్ కు రూ.25 లక్షలుగా ప్రకటించారు. ఇప్పటివరకు ఈ టోర్నీ విజేతకు రూ.6 లక్షలు, రన్నరప్ కు రూ.3 లక్షలు ఇచ్చారు.
* సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో ఇప్పటివరకు విజేతకు రూ.5 లక్షలు, రన్నరప్ కు రూ.3 లక్షలు. ఇప్పుడు ఆ ప్రైజ్ మనీని భారీగా పెంచారు. విజేతకు రూ.40 లక్షలు, రన్నరప్ కు రూ.20 లక్షలుగా చేశారు.

ఆటగాళ్లకు ప్రైజ్ మనీ పెంచడం ద్వారా వారిని మరింత ప్రోత్సహించినట్టే అవుతుంది. తాజాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రపంచ క్రికెట్ బోర్డులు సైతం ఖంగు తింటున్నారు. బీసీసీఐ పెంచిన పారితోషికం అలాంటిది మరి.

Read More: Anant Ambani & Radhika Merchant: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రేమకథ మీకు తెలుసా?