Bangalore-Guwahati Express train caught fire : బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, పొగలు కనిపించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సింహాచలం రైల్వే స్టేషన్‌లో రైలు స్లీపర్ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి, మంటలను గమనించిన లోకో పైలట్ రైలును ఆపాడు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. శనివారం సాయంత్రం 12509 బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో సింహాచలం రైల్వే స్టేషన్‌లో ఎస్-7 కోచ్‌లో మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన లోకో పైలట్ రైలును ఆపాడు. వెంటనే కోచ్ నుంచి ప్రయాణికులను బయటకు తీశారు.
అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు చేసి మంటలను ఆర్పారు. ఇప్పటి వరకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో రైలు కొన్ని గంటలపాటు ఆలస్యమై పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో రైలు వెళ్లిపోయింది. బ్రేక్ బైండింగ్ వల్ల పొగలు వచ్చినట్లు, మంటలు లేవని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ తెలిపారు. ఎస్-7 కోచ్‌లో తాత్కాలిక బ్రేక్ సిస్టమ్ లోపం కారణంగా పొగలు వచ్చాయి. దీంతో రైలు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. రైలు సింహాచల్ నుండి రాత్రి 9:30 గంటలకు బయలుదేరిందని చెప్పారు.
ఇదిలా ఉంటే.. గుజరాత్‌లో రైలును పట్టాలు తప్పించి ప్రమాదానికి గురయ్యేలా చేసేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ దుండగులు చేసిన నిర్వాకం లైన్‌మ్యాన్ అప్రమత్తత కారణంగా విఫలమయింది. శనివారం వేకువజామున సూరత్ జిల్లాలోని కోసంబ- కిమ్ స్టేషన్ల మధ్య రైలు పట్టాలను కలిపే ఫిష్‌ప్లేట్లను గుర్తు తెలియని దుండగులు తొలగించారు. అంతేకాకుండా… 40-50 బోల్టులను వదులు చేశారని అధికారులు తెలిపారు. రెండు ఫిష్ ప్లేట్లను తొలగించి పక్కనున్న ట్రాక్‌పై పడేశారని అధికారులు వెల్లడించారు. లైన్‌మ్యాన్ తెల్లవారు జాము 5.30 గంటల సమయంలో దీన్ని గమనించి అధికారులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఇంజినీర్లు, సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసిన తరువాత రైళ్ల రాకపోకలు పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also : Health Tips : 30 ఏళ్లు దాటినా ముఖంపై మొటిమలు వస్తున్నాయా? ఇవే కారణాలు కావచ్చు..!