Army Jawan: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో అదృశ్యమైన భారత ఆర్మీ సైనికుడు (Army Jawan) జావేద్ అహ్మద్ వానీని గురువారం (ఆగస్టు 3) పోలీసు బృందం కనుగొన్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల ట్వీట్ ప్రకారం.. జవాన్ జావేద్ అహ్మద్‌ను వైద్య పరీక్షల అనంతరం ప్రశ్నిస్తామని ఏడీజీపీ కశ్మీర్ తెలిపారు. ఈ విచారణలో ఆర్మీ, పోలీసు అధికారులు పాల్గొంటారు. జావేద్ అహ్మద్ జూలై 29న సెలవుపై తన ఇంటికి వచ్చాడు. కాగా, అదేరోజు రాత్రి 8:30 గంటల ప్రాంతంలో కనిపించకుండా పోయాడు. కిడ్నాప్‌కు గురైనట్లు జవాన్ కుటుంబీకుల తరఫున తెలిపారు. అయితే, జవాన్ కోలుకున్న తర్వాత అసలు విషయం తెలుస్తుంది. ఈ విషయంలో పోలీసులు ఇంకా ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదు. ఇప్పుడు జవాన్ కోలుకుని ప్రశ్నించే అంశం మాత్రమే తెరపైకి వచ్చింది.
2013లో ఇండియన్ ఆర్మీలో చేరాడు
కుల్గామ్‌లోని అస్తల్ గ్రామానికి చెందిన జావేద్ అహ్మద్ వానీ (28) తన గ్రామానికి చెందిన మరో ఆరుగురు అబ్బాయిలతో కలిసి 2013లో భారత సైన్యంలో చేరాడు. అతను శారీరక, వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. 2014లో జమ్మూకాశ్మీర్ లైట్ ఇన్‌ఫాంట్రీ (JAKLI) రెజిమెంట్‌లోని 3వ బెటాలియన్‌లో నియమించబడ్డాడు. జవాన్‌గా ఉన్న సమయంలో జావేద్ ఆర్మీలోని ఎలైట్ కౌంటర్-తిరుగుబాటు విభాగమైన రాష్ట్రీయ రైఫిల్స్ 9వ బెటాలియన్‌తో రెండు సార్లు పనిచేశాడు. అతను తన స్వస్థలమైన కుల్గామ్ జిల్లాలో నియమించబడ్డాడు. కుల్గామ్‌లోని చావల్గామ్‌లో ఉన్న ఆర్మీ స్థాపనలో పనిచేస్తున్నాడు.
Also Read: Telangana: రైతు రుణమాఫీ బకాయిలు విడుదల చేసిన ఆర్థికశాఖ
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా పనిచేశాడు. కుల్గామ్ జిల్లాలో అనేక కార్యకలాపాలలో భాగంగా ఉన్నాడు. అతని భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా అతని విజయవంతమైన తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల గురించి ఎటువంటి వివరాలు అందుబాటులో లేవు. ఎందుకంటే అలాంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం సాధారణంగా సైన్యం బయటకి చెప్పదు.
ఎల్లప్పుడూ ప్రజలకు సాయం
స్థానిక గ్రామస్తుల కథనం ప్రకారం.. జావేద్ చిన్నప్పటి నుంచి సాయం చేసే వ్యక్తి. అతను పేద ప్రజలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అతని అపహరణకు రెండు రోజుల ముందు అతను సమీపంలోని గ్రామంలోని రోగికి రక్తదానం చేశాడు. 2014 వరదల సమయంలో అతను తన గ్రామానికి చెందిన ఇతర యువకులతో కలిసి వరదలో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాడు. స్థానిక ప్రజల ప్రకారం.. అతనికి శత్రువులు ఎవరూ లేరని తెలుస్తుంది.