Site icon HashtagU Telugu

Railway : బాలుడి మనసు గెలిచిన ఆర్మీ హవల్దార్.. బొమ్మ కోసం రైల్వే శాఖ పరుగులు..

Railway

Railway

చిన్నారి కుటుంబం జనవరి 3వ తేదీన సికింద్రాబాద్‌లో అగర్తలా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కింది. రైలు బయలుదేరినప్పటి నుంచీ అద్నాన్‌ ఆ బొమ్మ ట్రక్కుతో ఆడుకొంటూనే ఉన్నాడు. ఎవరైనా సరదాకు బొమ్మను దాచినా.. పెద్దపెట్టున ఏడ్చేవాడు. అదే కోచ్‌లో ఉన్న ఇండియన్‌ ఆర్మీ హవల్దార్‌ విభూతి భూషణ్‌ పట్నాయక్‌ ఇదంతా గమనిస్తూ వచ్చారు. పశ్చిమబెంగాల్‌ శివారులోని కిషన్‌ గంజ్‌ (బిహార్‌) రాగానే అద్నాన్‌ కుటుంబం రైలు దిగిపోయింది. రైలు కదిలాక.. ఆ చిన్నారి తన బొమ్మను అక్కడే మరిచి దిగిపోయిన విషయాన్ని హవల్దార్‌ గుర్తించారు. ఎలాగైనా ఆ బొమ్మను తిరిగి అద్నాన్‌ వద్దకు చేర్చాలని ఆయన ఆరాటపడ్డారు. అప్పటికే రైలు చాలా దూరం వెళ్లిపోయింది. పిల్లాడి పేరు తప్ప తల్లిదండ్రుల వివరాలేవీ తెలియదు. వెంటనే రైల్వే (Railway) హెల్ప్‌లైన్‌ ‘139 రైల్‌ మదద్‌’ కు ఆయన ఈ విషయం చేరవేశారు. ఫిర్యాదైతే చేశారు కానీ, ఎమర్జెన్సీ కేసుల కోసం పనిచేసే రైల్వే హెల్ప్‌లైన్‌ ఓ కుర్రాడి బొమ్మ గురించి శ్రమ తీసుకుంటుందా అనే అనుమానం లోలోపల లేకపోలేదు. అయినా మనసులో ఏదోమూల ఓ చిన్నఆశ.

ఇటు రైల్వే అధికారులు (Railway Officials) సైతం అసాధారణ రీతిలో స్పందించారు. ఓ బృందాన్ని రంగంలోకి దింపి రిజర్వేషను ఛార్టు ఆధారంగా అద్నాన్‌ కుటుంబం వివరాలు బయటికి తీశారు. పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర్‌ దినాజ్‌పుర్‌ జిల్లా ఖాజీ గ్రామంలో ఉంటున్న అద్నాన్‌ తల్లిదండ్రులు మోహిత్‌ రజా, నస్రీన్‌ బేగంల ఇంటికి వెళ్లి చిన్నారికి ఆ బొమ్మను అందజేశారు. ‘ఆ బొమ్మంటే మావాడికి చాలా ఇష్టం. బొమ్మ పోగొట్టుకున్నామంటే ఎవరు పట్టించుకుంటారులే అని ఫిర్యాదు కూడా చేయలేదు. హవల్దార్‌ పట్నాయక్‌కు, రైల్వేశాఖకు ధన్యవాదాలు’ అంటూ మోహిత్‌ రజా భావోద్వేగానికి గురయ్యారు. ‘హమ్మయ్యా.. ఆ బొమ్మ మళ్లీ అద్నాన్‌ వద్దకు చేరింది. దాన్ని అక్కడే వదిలేస్తే నాకు మనశ్శాంతి ఉండేది కాదు’ అని హవల్దార్‌ పట్నాయక్‌ స్పందించారు.

Also Read:  Arthritis Problem : చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్యకు ఇలా చెక్ పెట్టండి..